అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి.. పోలీసులు ఉంటే సరిపోతుందంటూ జగన్ తీరును జేసీ ఎండగట్టారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని, ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక తాను టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని చెబుతూ.. జగన్ చాలా తెలివైన వాడని సెటైర్ వేశారు. ప్రతి ఒక్కరికీ సామజిక వర్గం ఉంటుందని, అది లేని వారు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక టీడీపీ వాళ్ల వీపులు పగులకొట్టి ఏకగ్రీవాలంటే సరిపోతుందా? అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ముందు, తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు. కష్టపడి నామినేషన్లు వేశామని, వేసినా పోలీసులు, వైసీపీ వారు ఉండనిస్తారా? అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ అధినేతకు, ఉన్నతాధికారులకు పోలీసులు భయపడుతున్నారని, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తేనే దౌర్జన్య కాండను ఆపవచ్చని తాము ఈసీని కోరామని అన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద డబ్బులు లేకపోతే టీడీపీ ఆ ఖర్చును భరిస్తుందని అన్నామని, తమ వాదనను ఆయన సానుకూలంగా విన్నారని పేర్కొన్నారు.
అయితే ఎన్నికల ప్రక్రియకు ఎక్కువ రోజులు తీసుకోవడం సరికాదని, తక్కువ రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగియాలని ఆయన అభిప్రాయపడ్డారు. తక్కువ రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిస్తే ఖర్చు ఆదా అవుతుందని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.