జనసేన బలోపేతమే లక్ష్యంగా పొలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ నియమించిన పవన్

pawan kalyan sensational comments on ap elections
Share Icons:

అమరావతి:

 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా ఒక్క సీటుకే పరిమితమైన జనసేన పార్టీ….ఫలితాల అనంతరం అంత యాక్టివ్ గా లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా కొన్ని రోజులపాటు మౌనంగా ఉండిపోయారు. అయితే ఇన్నిరోజుల తర్వాత పవన్ పార్టీ బలోపేతం  దిశగా అడుగులేస్తున్నారు.

 

అందులో భాగంగా పార్టీలో కీలకంగా ఉండే పొలిట్ బ్యూరో, పోలిటికల్ అఫైర్స్ కమిటీలని నియమించారు. నాదెండ్ల మనోహర్ చైర్మన్‌గా 12 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని రూపొందించారు. అలాగే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు.

 

ఇక పొలిటిబ్యూరోలో నాదెండ్ల మనోహర్‌తో పాటు రాజు రవితేజ్, పి.రామ్మోహన్‌రావు, అర్హంఖాన్‌లను నియమించారు. పొలిటికల్ అఫైర్స్‌ కమిటీలో కొణిదెల నాగబాబు, రాపాక వరప్రసాద్, కోన తాతారావు, పాలవలస యశస్విని, మనుక్రాంత్‌రెడ్డి, బి. నాయకర్, తోట చంద్రశేఖర్, కందుల దుర్గేష్, ముత్తా శశిధర్, పసుపులేటి హరిప్రసాద్‌, ఎ. భరత్‌ భూషణ్‌ ఉన్నారు.

 

ఇదిలా ఉంటే మొన్న ఎన్నికల్లో జనసేన తరుపున నరసాపురం లోక్ సభ నుంచి పోటీ చేసి నాగబాబు ఓడిపోయిన  విషయం తెలిసిందే. అయితే ఓడిన చోటే మళ్ళీ సత్తా చాటాలని భావిస్తున్న నాగబాబు…వారంలో ఏదొక రోజు నరసాపురం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఆయన నరసాపురం వెళ్లారు.

 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అధికారంలో ఉన్న వారికి పోలీసులు సపోర్టు చేస్తే చేయొచ్చు గానీ, లేనిపోని కేసులు బనాయించడం కరెక్టు కాదని అన్నారు. అధికారంలోకి వచ్చిన వాళ్లు ఎంత బాగా పరిపాలన చేస్తారన్నదే ముఖ్యం తప్ప, ప్రతీకారచర్యలకు పాల్పడటం సబబు కాదని అన్నారు.

 

తమ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని తెలిసిందని, అలా చేయకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. శ్రుతి మించితే మాత్రం తాము కూడా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తామని, ‘జనసేన’ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు.

Leave a Reply