జనసేనకు దూరంగా లేను…దగ్గరగా కూడా లేను…

police case against janasena mla
Share Icons:

తిరుపతి: మరోసారి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని తన మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటే తీరప్రాంతాల్లోని గ్రామాలు, వెనకబడిన జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే ఖచ్చితంగా మద్దతిస్తానని ఇంతకు ముందే చెప్పానని ఆయన గుర్తు చేశారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని చెప్పారు. జనసేన పార్టీకి దూరంగా లేనని.. దగ్గరగా కూడా లేనని స్పష్టం చేశారు. ఈ మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలవలేదని తెలిపారు.

కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలిచారు. అయితే కొన్ని నెలల తర్వాత జనసేన పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. జగన్‌కు పాలాభిషేకాలు చేయడంతో పాటు అసెంబ్లీలోనూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సొంత జిల్లాలో జరిగిన జనసేన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. పార్టీ నిర్వహించిన ఈ ఈవెంట్‌కూ హాజరుకాలేదు. దాంతో పవన్ కల్యాణ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేశారు.

ఇదిలా ఉంటే వివాదాలకు తావులేని భూములను మాత్రమే పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని అన్నారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలన్నారు . రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందిపడతారు’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

 

Leave a Reply