జనసేన మీటింగ్‌కు రాపాక డుమ్మా…మంత్రితో కలిసి ఎడ్ల పందాలు…

police case against janasena mla
Share Icons:

అమరావతి:  సనివారం నాడు పార్టీ నేతలతో అధినేత పవన్ కల్యాణ్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరుకాలేదు. మీటింగ్‌కు గైర్హాజరైన ఆయన.. ఇదే సమయంలో గుడివాడలో మంత్రి కొడాలి నానితో కలిసి ఉన్నారు. అక్కడ మీటింగ్ జరుగుతుంటే తీరిగ్గా నానితో కలిసి ఎడ్ల పందాలను రాపాక తిలకించారు. అయితే పవన్‌తో సమావేశానికి రాపాక కావాలనే రాలేదని జనసేన నాయకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ ఎడ్లపందాలు చూడలేదని.. అందుకే గుడివాడకు వచ్చానని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదేనన్నారు. రాజధాని రైతులు ధర్నాలు చేయడం కంటే.. సీఎం జగన్‌ను వచ్చి కలిస్తే మంచిదని సలహా ఇచ్చారు.

ఇదిలా ఉంటే అమరావతి ఆందోళనలు, తదితర సమస్యలపై ఏపీలోని అన్ని జిల్లాలకు చెందిన జనసేన నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్… ఆ వెంటనే ఢిల్లీ బయలుదేరివెళ్లారు. ఏపీ రాజధాని పరిణామాలపై నిన్న అమరావతి రైతులతో సమావేశమైన పవన్ కళ్యాణ్… ఈ అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని… వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నేడు జనసేన నేతలతో సమావేశమైన వెంటనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్‌తోపాటు పలువురు జనసేన నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దలను కలిసి అమరావతి ఆందోళనలు, ఇతర అంశాలపై చర్చించాలని జనసేన నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అటు పవన్ ముందు పార్టీ నేతలు కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజధాని వ్యవహారంతో పాటుగా..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవ్వటం పైన చర్చ జరిగింది. ఆ సమయంలో కొందరు నేతల ఆశ్చర్యకంగా కొన్ని కీలక ప్రతిపాదనలు సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒంటరి పోరు కంటే కీలక పార్టీతో పొత్తుతో వెళ్లటం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అధికార వైసీపీ.. బీజేపీ కాకుండా ఏ పార్టీతో వెళ్లినా పార్టీకి ప్రయోజనం ఉంటుందని పలువురు ప్రతిపాదించినట్లు సమాచారం. మరి కొందరు టీడీపీతో స్థానిక సంస్థల ఎన్నికలతోనే పొత్తు పెట్టుకోవాలని సూచించారు. అయితే, పార్టీ అధినేత పవన్ మాత్రం దీని పైన తన అభిప్రాయం ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు.

 

Leave a Reply