ఆ ఎస్‌ఐ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చేస్తానని అనడంతో రగడ మొదలైంది….

janasena mla arrest and release
Share Icons:

రాజోలు:

 

మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడి సంఘటన నేపథ్యంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మలికిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 11వ తేదీ రాత్రి పేకాట ఆడుతున్న కొందరిని ఎస్‌ఐ కేవీ రామారావు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిలో అనారోగ్యానికి గురైన కలగత కుమార్‌ను విడుదల చేయాల్సిందిగా ఎమ్మెల్యే రాపాక ఎస్‌ఐకు ఫోన్‌ చేశారు.

 

కానీ అందుకు ఎస్‌ఐ అంగీకరించలేదు. తర్వాత ‘మిమ్మల్ని ఎస్‌ఐ దూషించడంతోపాటు గన్‌తో పాయింట్‌ రేంజ్‌లో కాల్చేస్తానని అనుచితంగా మాట్లాడారు’.. అంటూ ఒక నాయకుడు రాపాకకి సమాచారం అండిచారు. దీంతో కోపోద్రికుడైన ఎమ్మెల్యే వరప్రసాదరావు అదేరోజు రాత్రి అనుచరగణంతో స్టేషన్‌ వద్దకు చేరుకుని ఎస్‌ఐను నిలదీశారు. ఒకదశలో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీస్ స్టేషన్‌ అద్దాలను ధ్వంసం చేశారు.

 

ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో ఎమ్మెల్యే రాపాక పరిస్థితిని అమలాపురం డీఎస్పీకి వివరించారు. ఆ తర్వాత మలికిపురం ఎస్‌ఐ రామారావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మరికొంతమందిపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఎమ్మెల్యే రాపాక డీఎస్పీ ముందు లొంగిపోయారు. భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ రాపాకను పోలీసు వాహనంలో ఎక్కించుకుని రాజోలు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.రమణారెడ్డి ముందు హాజరుపరిచారు. అయితే ఈ కేసు విచారణ తన పరిధిలోకి రానందున ఎమ్మెల్యే రాపాకకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరుచేసి విడుదల చేయవల్సిందిగా న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలతో ఎమ్మెల్యేను విడుదల చేశారు.

Leave a Reply