జనసేనకు గుడ్ బై చెప్పేస్తున్న నేతలు…త్వరలో ఆకుల వైసీపీలోకి?

Share Icons:

అమరావతి: ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై ఒక్క సీటు తెచ్చుకున్న జనసేన పార్టీని నేతలు వరుసగా వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ కి గుడ్ బై చెప్పేసే వైసీపీ, బీజేపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా  గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ఆ పార్టీ సీనీయర్‌ నేత ఆకుల సత్యనారాయణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.

2014లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలు పొందిన సత్యనారాయణ సార్వత్రిక ఎన్నికల ముందు ఆ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం పార్టీ ఇచ్చింది. జనసేనాని ఆధ్వర్యంలో అదృష్టం పరీక్షించుకున్నా ఓటమి తప్పలేదు. అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్టు వుంటున్న ఆయన, ఇప్పుడు అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అయితే నేతల వలసలతో జనసేన పార్టీ మనుగడకి ఇబ్బందిగా మారింది. ఎన్నికల్లో ఓడిపోగానే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరిపోయారు. ఇక ఇటీవల పార్టీలో సీనియర్ నేతగా కొనసాగి అనకాపల్లి ఎంపీ స్ధానం నుండి పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చింతల పార్ధసారథి గుడ్‌బై చెప్పడం ఆ పార్టీ భవిష్యత్తును తెలియజేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ సైతం ఇప్పుడు జనసేన పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు.

కాకపోతే ఒకవైపు ఏపీలో టీడీపీ ని ఖాళీ చేస్తామని బీజేపీ దూకుడు చూపిస్తున్న వేళ వైసీపీ నుండి జనసేన నుండి కూడా నాయకులను ఆకర్షించే పనిలో పడింది బీజేపీ . ఈ నేపధ్యంలో పార్టీని బలోపేతం చెయ్యటం అటుంచి పార్టీలో ఉన్న కీలక నేతలు పార్టీ వీడకుండా కాపాడే ప్రయత్నం పవన్ చేస్తారా ? ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుంటే జనసేన కీలక నేతలు జంప్ అంటుంటే అది పార్టీ కి పెద్ద మైనస్ గా మారే ప్రమాదం కనిపిస్తుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి తమ సత్తా చాటాలని జనసేన భావిస్తుంది. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగాకనిపిస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో జనసేన భవిష్యత్ ఎలా ఉంటుందో.

 

Leave a Reply