ఢిల్లీకి పవన్…పొత్తు వ్యవహారం కూడా తెలుస్తారా?

Share Icons:

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈరోజు రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొదటిది అమరవీరులకు విరాళం. ఇదివరకే ఆయన అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్‌ను ఇచ్చేందుకు ఆయన సైనికాధికారుల్ని కలవనున్నారు. ఇందుకోసం కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి… రూ.కోటి విరాళాన్ని అంస్తారు. ఇటీవల ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ కోటి విరాళం ప్రకటించారు. చాలా మంది రాజకీయ నాయకుల్లాగా, ప్రకటనకే పరిమితం కాకుండా, మాట నిలబెట్టుకుంటున్నారు.

ఇక మధ్యాహ్నం పవన్ విజ్ఞాన భవన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు పవన్ సమాధానం ఇస్తారు. అలాగే రాజకీయాల్లో మార్పు తేవడానికి యువత ఏవిధంగా ముందుకు రావాలో ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం కూడా చేస్తారని తెలిసింది. దేశానికి బలమైన, అవినీతికి పాల్పడని యువ రాజకీయ నాయకుల అవసరాన్ని ఉద్దేశించి నిర్వహిస్తున్న ఈ సదస్సులో పవన్ కళ్యాణ్‌పై ప్రత్యేకంగా రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని సమాచారం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొంటారు.

అటు వైసీపీ, బీజేపీ చేతులు కలిపితే… తాను బీజేపీతో కటీఫ్ చెబుతానని ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి పొత్తూ లేదనీ, తాము జనసేనతోనే కలిసి సాగుతామని బీజేపీ నేతలు కొందరు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే బీజేపీ-జనసేన పొత్తులో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది.

 

Leave a Reply