పాక్ మరో కుట్ర: మసూద్ అజార్ రహస్య విడుదల…

Jaish chief Masood Azhar secretly released from Pakistan jail
Share Icons:

ఇస్లామాబాద్:

జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర నుంచి పాకిస్థాన్ మన దేశంపై అనేక రకాలు విషం చిమ్ముతున్న విషయం తెలిసిందే. ఓ వైపు విమర్శలు చేస్తూనే…మరోవైపు పాక్ రేంజర్లు సరిహద్దుల్లో దాడులకు దిగుతున్నారు. మరోవైపు చాలామంది ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడి దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే మరో కుట్రకు ఆ దేశం పావులు కదుపుతున్నట్లు సమాచారం. గతంలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అరెస్టు చేసిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. అతడ్ని రహస్యంగా విడుదల చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది. దీంతో ఐబీ వర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి.

రాజస్థాన్-కాశ్మీర్ సెక్టార్లలో భారీ కుట్రకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, అందుకే.. ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేసేందుకు రెండ్రోజుల క్రితం అజార్‌ను విడుదల చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌, రాజస్థాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలను అప్రమత్తం చేయాలని సూచించింది.

ఇదిలా ఉంటే ఉగ్రవాదాన్ని నియంత్రించాలంటూ ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ ఏకాకిగా మిగిలిపోయింది. తన వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని చైనా మాత్రమే పాకిస్థాన్ కు అండగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సంక్షేమ ప్రాజెక్టుల్లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో, మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని చైనా రాయబారి యవో జింగ్ తెలిపారు.

మరోవైపు పాకిస్థాన్ పెట్టుబడుల కోసం దిగజారి ప్రవర్తిస్తోంది. బెల్లీ డ్యాన్సర్ల చేత పెట్టుబడిదారులకు కనువిందు చేయించి… వారిని బుట్టలో వేసుకునేందుకు యత్నిస్తోంది. ప్రభుత్వ దిగజారుడుతనంపై ఆ దేశ ప్రజలే విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఓ వైపు ఇండియా చంద్రయాన్-2 ప్రయోగంలో బిజీగా ఉంటే… పాక్ మాత్రం బెల్లీ మిషన్ ను సమర్థవంతంగా నిర్వహించిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Leave a Reply