నేడే జగనన్న వసతి దీవెన మొదలు…పథకం ఉపయోగాలు ఇవే..!

ys-jagan-laid-foundation-stone-steel-plant-kadapa district
Share Icons:

అమరావతి: అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పలు సంక్షేమ పథకాలు అందిస్తూ, ప్రజలకు మేలు చేస్తున్న సీఎం జగన్ నేడు మరో సంక్షేమ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. విద్యార్ధుల కోసం జగనన్న వసతి దీవెన పథకాన్ని విజయనగరం జిల్లాలో ప్రారంభించబోతున్నారు.

విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి వెళ్లి ఉదయం 11 గంటలకి మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు వెళ్తారు. ముందుగా అక్కడి ఎగ్జిబిషన్ స్టాళ్లను చూస్తారు. తర్వాత వైఎస్ఆర్ జగనన్న దీవెన పథకాన్ని ప్రారంభిస్తారు. పథకం గురించి ప్రజలకు వివరిస్తారు. తర్వాత జగన్… మధ్యాహ్నం 12.25 నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. మధ్యాహ్నం 12.35కి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.45కి దిశ పోలీస్ స్టేషన్‌ నుంచీ అక్కడి పోలీస్ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్‌కి వెళ్తారు.

అక్కడి నుంచీ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి… మధ్యాహ్నం 1 గంటకు విశాఖ నుంచీ గన్నవరం బయల్దేరతారు. సీఎం జగన్ తొలిసారిగా సీఎం హోదాలో విజయనగరం వెళ్తున్నారు. అందువల్ల ఆయన పర్యటనపై జిల్లాలో వైసీపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నవరత్నాల్లో భాగం ఈ పథకం. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఇందులో భాగంగానే జగనన్న దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మొదట్లో ఉన్నత చదువులు చదువుతున్న వారికే వసతి దీవెన అమలుకు ప్రతిపాదించినప్పటికీ, తరువాత దీనిని ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింప జేస్తున్నారు. అలా ఈ పథకాన్ని 11.87 లక్షల మందికి వర్తింపచేస్తున్నారు. తొలి విడత విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,140 కోట్లు జమ చేయనున్నారు.

ఏడాదికి రెండుసార్లుగా ఈ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో వేస్తారు. 24న (సోమవారం) తొలివిడతగా 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, 86,896 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500ల చొప్పున,… డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులు 10.47 లక్షల మందికి రూ.10,000ల చొప్పున చెల్లిస్తారు. 25 నుంచి జగనన్న విద్యా, వసతి దీవెన కార్డులను ఇంటింటికీ వెళ్లి వాలంటీర్లు ఇస్తారు.

 

Leave a Reply