పీకే డ్రాప్ నిజమేనా!

Share Icons:

హైదరాబాదు, సెప్టెంబర్ 10,

ఎన్నికల వ్యూహకర్త, పార్టీల ప్రచార సారథి ప్రశాంత్ కిశోర్  2019 ఎన్నికల్లో తాను ఏ పార్టీ లేదా వ్యక్తుల తరఫున పని చేయబోనని స్పష్టం చేశారు. బిహార్ లేదా గుజరాత్‌లో మూలాల్లోకి వెళ్లి జనంతో కలిసి పని చేయాలని ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  తన కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నామని, జగన్ నుంచి తాను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజం లేదని ఆయన అన్నారు. నిజానికి ఈ డొమైన్ నుంచి బయటకు వచ్చేయాలని రెండేళ్లుగా భావిస్తున్నానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.  నేను లేకున్నా.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) పని చేస్తుందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. సమర్థులకు దాని బాధ్యతలను అప్పగిస్తానని తెలిపారు. కాగా 2019 ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్‌తో ప్రశాంత్ కిశోర్‌ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయన టీం మాత్రమే జగన్ పార్టీ కోసం పని చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఒక వేళ అదే నిజమైతే జగన్ ఇక మీదట ఎన్నికల కోసం సొంతంగా వ్యూహరచన చేసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో తానే గెలుస్తానని జగన్ బలంగా నమ్మారు. కానీ ప్రత్యర్థుల మెరుగైన పోల్ మేనేజ్‌మెంట్, ప్రచారం కారణంగా వైసీపీ ఓడిపోయింది. దీంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం చేసుకున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. తర్వాత బిహార్లో నితీష్ కుమార్ తరఫున, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేశారు. యూపీలో కాంగ్రెస్ తరఫున పని చేసినప్పటికీ.. ఆ పార్టీ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. దీనితో జగన్ కు సరైన మార్గనిర్దేశకత్వం లోపిస్తుందేమోనని పార్టీవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

 

మామాట: జిత్తుల మారి చాణక్యుడు లేకపోతో  పోరు కష్టమవుదుందేమో…

Leave a Reply