కృష్ణాలో జగన్ సరికొత్త వ్యూహం…

Share Icons:

విజయవాడ, 9 ఫిబ్రవరి:  

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో టీడీపీకి కంచుకోట ఉన్న కృష్ణా జిల్లాలో పాగా వేసేందుకు జగన్ సరికొత్త ప్లాన్ అమలు చేయనున్నారు. ఈ జిల్లాలో టీడీపీ కమ్మ సామాజికవర్గానికి టికెట్లు ఇచ్చిన చోట ఇతర సామాజికవర్గాలకు టికెట్లు ఇచ్చి జగన్ ఓటమిని చవిచూశారు.

అయితే ఈ సారి మాత్రం ఆ నియోజకవర్గాల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చిన బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.  అందులో ముఖ్యంగా మైలవరం నుంచి మంత్రి దేవినేని ఉమకు పోటీగా ఆయన సామాజికవర్గానికే చెందిన వసంత కృష్ణప్రసాద్‌ను బరిలోకి నిలపడం దాదాపుగా ఖాయమైంది.

అటు గన్నవరంలో వల్లభనేని వంశీ మీద గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన వారికి సీటిచ్చి ఓడిపోయిన వైసీపీ… ఈ సారి కమ్మ సామాజికవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావుని నిలిపేందుకు సిద్ధమవుతోంది. అలాగే గుడవాడ నియోజకవర్గం నుంచి ఇప్పటికే కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉండటంతో… మరోసారి ఆయనకే వైసీపీ టికెట్ దక్కడం దాదాపుగా ఖాయమైంది. టీడీపీ తరుపున అదే సామాజికవర్గానికి చెందిన రావి వేంకటేశ్వరరావుకి గాని, దేవినేని అవినాష్ గాని బరిలో ఉండొచ్చు.

ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ గద్దె రామ్మోహన్ మీద అదే సామాజికవర్గానికి చెందిన యలమంచిలి రవిని బరిలోకి దింపనున్నారు.  గతంలో ఇక్కడ నుంచి వంగవీటి రాధాకృష్ణను బరిలోకి దిగి భంగపడ్డారు. అలాగే పెనమలూరులోనూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓ నేతని బరిలోకి దింపుతారా లేక బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి పార్థసారధికి అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మామాట: మొత్తానికి టీడీపీకి ధీటుగా జగన్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply