ఎన్టీఆర్ మామతో జగన్ అదిరిపోయే స్కెచ్…!

Share Icons:

విజయవాడ, 1 మార్చి:

మరో రెండు నెలల్లో ఏపీకి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ, వైసీపీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉన్నాయి. అయితే ప్రతిపక్ష నేత జగన్..బలం ఉన్న నేతలనీ పార్టీలోకి ఆహ్వానించి వారికి టికెట్లు కేటాయిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువ ఉన్న రెండు నియోజకవర్గాలని జగన్ గట్టిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నుండి వైసీపీ తరుపున గెలిచిన గొట్టిపాటి రవి కుమార్ టీడీపీలో చేరారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే మళ్ళీ బరిలో దిగనున్నారు. అక్కడ ఆయన బలంగా ఉన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఆయన మళ్ళీ విజయం సాధిస్తానని ధీంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ రవికి ధీటైనా అభ్యర్ధిని నిలపడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన గుంటూరు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, శ్రీనివాసరావును ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీకి దించాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.

ఇక నార్నేను అద్దంకి బరిలో దించడం వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని జగన్ వ్యూహం. అద్దంకిలో గొట్టిపాటి రవిని ఆర్థికంగా ఢీకొట్టడంతో పాటు ఆ పొరుగున ఉన్న పర్చూరు నియోజకవర్గం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం వైసీపీ తరఫున పోటీ చేయడం దాదాపు ఖాయం.

ఈ రెండు చోట్ల కమ్మ సామాజికవర్గం బలమైన ప్రభావం చూపనుంది. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలనే జగన్ కూడా వ్యూహాత్మకంగా రంగంలోకి దించుతున్నారు. మరి చూడాలి జగన్ వ్యూహం ఏ మేర ఫలిస్తుందో.

మామాట: జగన్ గట్టి ప్లానే వేశారుగా

Leave a Reply