ఆ రెండు బిల్లులపై మరో ట్విస్ట్…ఏపీ ప్రభుత్వం టార్గెట్ అదేనా?

ys-jagan-laid-foundation-stone-steel-plant-kadapa district
Share Icons:

అమరావతి: గురువారం ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సభలు ప్రోరోగ్ అయిన విషయం తెలిసిందే. అందువల్ల మళ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేవరకూ… అభివృద్ధి వికేంద్రీకరణ, సి‌ఆర్‌డి‌ఏ రద్దు  బిల్లులకూ మోక్షం ఉండదు. అందువల్ల అప్పటివరకూ ఎదురుచూడటం టైమ్ వేస్ట్ అని భావిస్తున్న ప్రభుత్వం… ఆర్డినెన్స్ వైపు అడుగులు వేస్తోంది. మరి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగలదా? సెలెక్ట్ కమిటీకి పంపుతున్న బిల్లులపై ఆర్డినెన్స్ జారీ చేసే ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది.

ఓ అంచనా ప్రకారం అది సాధ్యం కాదంటున్నారు. సెలెక్ట్ కమిటీలో తేలిన తర్వాతే… ఆర్డినెన్స్ జారీ చేసేందుకు వీలవుతుందని అంటున్నారు. మరో అంచనా ప్రకారం… అది సాధ్యమే అంటున్నారు. ముందుగా ఆర్డినెన్స్‌లు జారీ చేసేసి… ఆ తర్వాత ఆరు నెలల్లో రెండు బిల్లులకూ ఆమోదం పొందేలా చేసుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఆరు నెలల్లో మండలి సమావేశం కాకపోతే… ఆర్డినెన్స్‌ని మరో ఆరు నెలలు పొడిగించుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. దీనిపై ప్రభుత్వం లోతుగా చర్చిస్తోంది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులపై ఆర్డినెన్స్ జారీ చేయవచ్చా లేదా అన్నదానిపై న్యాయపరమైన చిక్కుల్ని పరిశీలిస్తోంది.

మరోవైపు మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం చేసిన తీర్మానంపై ఢిల్లీలో పోరాటం చేస్తామని టీడీపీ చెబుతోంది. అలాగే… ఏపీ శాసనసభ, మండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా టీడీపీ… ఢిల్లీ స్థాయిలో సవాలు చేయాలనుకుంటోంది. అలా ఎలా ప్రోరోగ్ చేస్తారని ప్రశ్నిస్తున్న టీడీపీ… వైసీపీకి మేలు చేయాలనే ఉద్దేశంతోనే గవర్నర్ అలా చేశారనీ… దీనిపై కేంద్ర పెద్దలతో చర్చిస్తామని అంటోంది.

కాగా, అభివృద్ధి వికేంద్రీకరణ, సి‌ఆర్‌డి‌ఏ రద్దు బిల్లులను జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించి శాసనమండలికి పంపింది. ఈ బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంతలో ఛైర్మన్… సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నారు. మండలే రద్దవుతున్నప్పుడు ఇక సెలెక్ట్ కమిటీతో పనేముందన్నది వైసీపీ వర్గాల వాదన. కానీ… మండలి రద్దుకి కనీసం రెండేళ్లు పడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. అలా జరగకుండా ఉండేందుకు సీఎం జగన్… ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిసింది.

మార్చి 15 నుంచీ ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగే ఛాన్సుంది. నెల పాటూ ఇవి జరగొచ్చు. ఆ సమయంలో అభివృద్ధికి చెందిన బిల్లుల్ని ఆమోదింపజేసుకొని… విశాఖకు కార్యాలయాల తరలింపు ప్రక్రియ చేపట్టాలనుకుంటున్నట్లు తెలిసింది. ఉగాది నాటికి విశాఖ నుంచే పాలన సాగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి చూడాలి రానున్న రోజుల్ల్ ఏపీలో ఏం జరగనుందో?

 

Leave a Reply