ప్రజలు కోరుకున్నదే అమలు చేస్తున్న జగన్….

Share Icons:

అమరావతి: అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1-6వ తరగతులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాము ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించడం లేదని, కానీ తెలుగు మీడియం కూడా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ శాతం ప్రజల మాత్రం జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలకు మంచి జరుగుతుందని పేద వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే జగన్ తన సుధీర్ఘ పాదయాత్రలో ప్రజల నుంచి ఈ డిమాండ్ గమనించి అధికారంలోకి రాగానే అమలు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై బుధవారం జి‌ఓ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్‌ స్కూళ్లకు కూడా ఈ జీవో వర్తించనుంది. దీనిప్రకారం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి కానుంది.

మరోవైపు అన్ని తరగతులకు తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్ట్‌ను కచ్చితంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంగ్లిష్ బోధనలో ప్రావీణ్యం ఉన్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం సూచించింది. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు కోసం టీచర్ల నియామకాలు, శిక్షణ చేపట్టే బాధ్యతను విద్యాశాఖకు అప్పగించిన ప్రభుత్వం.. ఇంగ్లిష్‌లో బోధించేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన గైడెన్స్‌ ఇవ్వాలని, పాఠ్యాంశాలకు సంబంధించి కొత్త సిలబస్‌ను సిద్ధం చేయాలని ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి ని ఆదేశించింది.

అయితే తొలిదశలో 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేయాలని మొదట భావించినప్పటికీ.. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీనిప్రకారం వచ్చే ఏడాది నుంచి 1 – 6వ తరగతి వరకు.. ఆ తర్వాత ప్రతీ ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంచుతూ 10వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియం అమలు చేయనున్నారు. ఇక ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే.. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవుల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇంగ్లిష్‌ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది.

 

Leave a Reply