ఐటీ దాడులపై ఐ‌వై‌ఆర్ వెరైటీ ట్వీట్…బీజేపీకు చురకలు..

Share Icons:

అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రల్లో జరిగిన ఐటీ దాడులు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా అవకతవకలను గుర్తించామని ఐటీ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. వివరణ ఇవ్వలేని రూ. 85 లక్షల నగదును, రూ. 71 లక్షల విలువైన నగలను సీజ్ చేశామని తెలిపింది. మరోవైపు, ఈ దాడులపై వైసీపీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ. 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. చదవడం వచ్చిన వారి వద్ద ఐటీ ప్రెస్ నోట్ ను చదివించుకోవాలని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైసీపీ నుంచి తనకు ఒకరు ఫోన్ చేశారని… ఐటీ దాడులపై మీరు ట్వీట్ చేయరా సార్? అని అడిగారని ఆయన చెప్పారు. తన ట్వీట్లు వైసీపీ, టీడీపీ అంచనాలకు అతీతంగా ఉంటాయని ఆయనకు తాను సమాధానమిచ్చానని తెలిపారు.

ఇదే సమయంలో బీజేపీపై కూడా ఐవైఆర్ విమర్శలు గుప్పించారు. ‘హాస్యాస్పదమైన విషయం. తెలుగు దేశంలో ఉంటూ బీజేపీని, ప్రధాని మోడీని హద్దులు పద్దులు లేకుండా దూషించిన వ్యక్తులే ఈరోజు బీజేపీ ప్రతినిధులుగా టీవీ షోలలో వస్తున్నారు. పంపించటానికి పార్టీ ప్రతినిధులు లేక బీజేపీ గొడ్డు పోయిందా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణే సహా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహించామన్న ఐటీ అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ సంస్థల పాత్రపై సోదాలు చేశామని పేర్కొన్నారు . తాజాగా రూ. 2వేల కోట్ల నల్లధనానికి సంబంధించి దాడులు చేశామన్న ఐటీ అధికారులు ప్రాధమిక పరిశోధనలోనే రూ.2వేల కోట్లను తరలించినట్టుగా వెలుగుచూసిందని పేర్కొన్నారు.

 

Leave a Reply