కూలీ పనులు చేసి లక్షల సంపాదన: టీఆర్ఎస్ నేతలకు నోటీసులు…రేవంత్ పనేనా?

Share Icons:

హైదరాబాద్: 2017లో టీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ వరంగల్‌లో పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఈ సభకు వచ్చే కార్యకర్తల దారి ఖర్చుల కోసం వినూత్నంగా ‘గులాబీ కూలీ’ పేరిట టీఆర్‌ఎస్‌ ఓ కార్యక్రమం చేపట్టింది. అగ్ర నేతల పిలుపు మేరకు అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ముఖ్యనేతలు కూలీ పనులు చేసి, నిమిషాల వ్యవధిలోనే రూ.లక్షలు సంపాదించారు.

అయితే గులాబీ కూలీల పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆ కార్యక్రమం జరిగినప్పటి నుంచి రేవంత్‌రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రజాధనాన్ని పార్టీ కోసం సేకరించారని, ఇది కొన్ని చట్టాలను ఉల్లంఘించడమేనని రాజ్యాంగ, ప్రభుత్వ సంస్థలకు ఆయన ఫిర్యాదు చేశారు. అప్పట్లో దీనిపై న్యాయస్థానాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి ఫిర్యాదుల వల్లే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలకు ఇప్పుడు ఐటీ నోటీసులు అందినట్లు సమచారం.

గులాబీ కూలీ కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ సమయంలో ఐస్‌క్రీమ్‌ అమ్మి రూ.7 లక్షలు సంపాదించగా.. మంత్రి పద్మారావు చేపలు అమ్మి సుమారు రూ.39 లక్షలు సంపాదించారనే ఆరోపణలున్నాయి. మంత్రి ఈటల రాజేందర్‌ రైస్‌ మిల్లులో మూటలు మోసి రూ.11 లక్షలకు పైగా సంపాదించారు. అంతేకాక, హరీశ్‌రావు రైస్‌ మిల్లులో పని చేసి రూ.6.27 లక్షలు కూడగట్టారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మోక్ష ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్‌ విల్లా్‌ల్లో పనులు చేసి ఇద్దరూ చెరో రూ.లక్ష చొప్పున సంపాదించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ స్వీట్‌ షాపులో మిఠాయిలమ్మి రూ.18.50 లక్షలు సంపాదించారు. వీటికి సంబంధించి అప్పట్లో కొందరు నాయకులు ట్వీట్లు కూడా చేశారు.

ఇలా డబ్బులు సంపాదించడంతో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలకు ఐటీ నోటీసులు అందినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధిచిన వార్తను పోస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘పగులుతున్న పాపాల (ముఠా) పుట్ట’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

 

Leave a Reply