నెల్లూరు, సెప్టెంబర్ 10,
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది. ఈనెల 16న పీఎస్ఎల్వీ సీ-42 రాకెట్ ప్రయోగం (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్)ని ప్రయోగించేందుకు షార్ శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు. 16వ తేదీ రాత్రి 10.07 గంటలకు ఈ రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం సిద్ధ్దమైంది. పీఎస్ఎల్వీ వాహననౌక యూకేకు చెందిన నోవాసర్-2, యస్.యస్.టి -1 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీకి సంబంధించిన నాలుగు దశల పనులు పూర్తయ్యాయని, ఇక ఉపగ్రహాలను అనుసంధానం చేయాలని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఉపగ్రహాలను ప్రయోగ వేదిక వద్దకు తరలించి ఆదివారం రాకెట్లో అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ కౌంట్ డౌన్ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.37 గంటలకు ప్రారంభమై నిరంతరంగా 33 గంటలు కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
మామాట: మీరు మరన్ని విజయాలు సాధించాలి ఇస్రో…