జేసీ వాయిస్ మార్చారు….కండువా కూడా మారుస్తారా?

Share Icons:

అనంతపురం: జేసీ దివాకర్ రెడ్డి…తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో ఏళ్ళు రాజకీయం అనుభవం గల నేత…కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఎదిగిన జేసీ 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. జేసీ సోదరుడు కూడా టీడీపీలోకి వచ్చి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో ఈ ఇద్దరు నేతలు తప్పుకుని కుమారులకు టికెట్లు ఇప్పించుకున్నారు. అయితే అనంతపురం పార్లమెంట్ నుంచి పవన్ రెడ్డి, తాడిపత్రి నుంచి అస్మిత్ రెడ్డిలు ఓటమి పాలయ్యారు.

అయితే ఎప్పుడు ఏదొక సంచలన వ్యాఖ్యలు జేసీ…ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుపై కొన్ని విమర్శలు కూడా చేశారు. తాజాగా జగన్ మా వాడే…పాలన బాగా చేస్తున్నాడని కితాబిచ్చారు. ఇక జగన్ ని పొగిడిన ఆయన తాజాగా మోడీని పోగిడేశారు. గతంలో ఇదే మోడీని హిట్లర్ తో పోల్చారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు ప్లేట్ మార్చారు. చంద్రబాబు చేసిన తప్పులతో ఓడాడని.. మోడీ పథకాలే ఆయనను గెలిపించాయన్నారు.. అందుకే  బీజేపీలోకి వలసలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని.. బీజేపీలోకి నేతలంతా మారడానికి మోడీషాల హవానే   కారణమన్నారు. ఏపీలోనూ ఇప్పుడు  వైసీపీకి ప్రత్యామ్మాయంగా టీడీపీ కంటే అందరూ బీజేపీ వైపే చూస్తున్నానని జేసీ తెలిపారు.

ఇక దేశంలో జమిలి ఎన్నికలు కనుక మోడీ తీసుకువస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమేనని జేసీ స్పష్టం చేశారు. తాజాగా మోడీపై ప్రశంసలు కురిపించిన జేసీ వ్యవహారం చూశాక ఈయన బీజేపీలో చేరడం ఖాయమన్న చర్చ అనంతపురం జిల్లాలో సాగుతోంది. మరి చూడాలి జేసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బీజేపీలోకి వెళ్లతారని ప్రచారం జరుగుతుంది. అటు టీడీపీ నేతలని చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న బీజేపీ…అధికార వైసీపీని కూడా టార్గెట్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే కాపు వర్గానికి తమ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. దీంతో..కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది.

కాపుల్లో మంచి పేరున్న ముద్రగడని పార్టీలోకి తీసుకురావడానికి బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ రిజర్వేషన్ల అంశం మీద సానుకూలంగా ప్రకటన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీని పైన హామీ వస్తే ముద్రగడ బీజేపీలో చేరటం ఖాయమే అని తెలుస్తోంది.

Leave a Reply