అధిక నిడివి అరవింద సమేతకి కలిసొస్తుందా…

Share Icons:

హైదరాబాద్, 9 అక్టోబర్:  

బాక్సాఫీస్ బాద్ షా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’ అంటూ థియేటర్స్‌లో గర్జించేందుకు సిద్ధమయ్యారు. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు రెడీ అయ్యింది ఈ మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తొలి చిత్రం ఇదే కావడంతో పాటు.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ హిట్ కొట్టాలన్ని కసితో ఈ సినిమా తెరక్కించారు.

ఆయన శైలికి భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎలిమెంట్స్‌తో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అరవింద సమేత ఉండబోతుందని టీజర్, ట్రైలర్‌లను బట్టి అర్ధమౌతోంది. ఇక ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘అరవింద సమేత’ యు/ఏ సర్టిఫికేట్‌ను అందుకుని సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టింది.

అయితే ఈ మూవీ రన్ టైమ్ కాస్త టెన్షన్‌కు గురిచేస్తుంది. ఈ మూవీ నిడివి రెండు గంటల 41 నిమిషాల 30 నెకన్లు.. మొత్తంగా 162 నిమిషాలు. నిజానికి సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు ఏ మాత్రం బోర్ ఫీల్ కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఆసక్తితో సినిమాలో లీనం అయిపోతాడు.

అయితే యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రాల్లో రన్ టైమ్ ఎక్కువైతే బోర్ ఫీల్ అయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే సాధార‌ణంగా రెండున్న‌ర గంట‌ల‌కు మించ‌కుండా ద‌ర్శ‌కులు, ఎడిట‌ర్లు సినిమాను ట్రిమ్ చేస్తుంటారు. అయితే ఇటీవల వ‌చ్చిన ‘అర్జున్ రెడ్డి’, ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘భరత్ అనే నేను’ ఆ భావ‌న‌ను ప‌టాపంచ‌లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇదిలాఉంటే.. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2 గంటల 40 నిమిషాలు నిడివితో విడుదలైంది.. ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా మైనస్ కావడంతో డిజాస్టర్ అయ్యింది.

ఆ తరువాత వచ్చిన అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య‌’ ర‌న్ టైమ్ 2 గంట‌ల 48 నిమిషాలు.. ఇందులో అక్కర్లేని సీన్లు చాలా ఉండటంతో ప్రేక్షకులకు బోర్ కొట్టింది. అయితే ‘అరవింద సమేత’ ఎక్కువ నిడివితో పెద్దగా కట్స్ లేకుండా రిలీజ్ చేయడం అనేది సాహసం అనే చెప్పాలి. అందులోని ‘రంగస్థలం’, ‘తొలిప్రేమ’ హిట్ చిత్రాలకు పనిచేసిన సీనియర్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పనిచేయడంతో ప్రేక్షకులకు ఏది అవసరమో లెక్కలేసుకునే కత్తెరేశారని యూనిట్ చెబుతోంది.

అయినా సినిమాకి హిట్ టాక్ వస్తే.. నిడివి ఎంత? ఏ సర్టిఫికేట్ వచ్చింది? అనేవి ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు. మొత్తానికి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ‘అరవింద సమేత’ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపడం ఖాయం గానే కనిపిస్తుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు హీరోయిన్స్‌గా నటించారు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందించగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల కాబోతోంది ‘అరవింద సమేత వీర రాఘవ’.

మామాట: మరి అరవింద సమేతబాక్సాఫీస్ వద్ద సత్తా చూపిస్తుందా..

Leave a Reply