కొబ్బరి నూనె తింటున్నారా…!

Share Icons:

తిరుపతి, సెప్టెంబరు 04,

కొన్ని మాసాలుగా మనం తినే నూనెల గురించిన వాదోపవాదాలు మీడియాలో కలవరపెడుతున్నాయి.  కొందరు కొబ్బరి నూనె తీసుకోండి బరువు తగ్గుతారు అంటూ ఉంటే, మరి కొందరు అబ్బే కొబ్బరి నూనె వాడాను ఫలితం లేదు కానీ మా వారికి బాగైందంటున్నారు. మరి కొందరు అబ్బో నూనె.. అదీ కొబ్బరి నూనె.. అది చెడు కొలస్ట్రాల్ పెంచుతుంది యమా డేంజర్ అంటూ భయపెడుతున్నారు. మరి కేరళలో అన్ని వంటలూ కొబ్బరినూనెతోనే చేసుకుంటారటకదా, అక్కడ హార్ట్ అటాక్ లు ఎక్కువా ఏమిటి? అని మరి కొందరు లా పాయింటు పీకుతున్నారు.

ఈ నేపథ్యంలో….      కొంతమంది చెబుతున్నట్లు, కొబ్బరి నూనె నిజంగా కొలెస్టరాల్‌ను తగ్గించే వండర్ ఫుడ్డా లేక దీనికి అనవసరంగా ప్రాధాన్యతను ఇస్తున్నారా? అన్నది తెలుసుకోవడానికి బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ2 లో ప్రసారమయ్యే ‘ట్రస్ట్ మీ ఐయామ్ ఎ డాక్టర్’ సిరీస్ కోసం ఒక పరిశోధన నిర్వహించాలని  భావించింది. ప్రఖ్యాత కేంబ్రిడ్జి పరిశోధకులు ఆచార్య కే-టీ ఖా, ఆచార్య నీతా ఫొరౌహిలను సంప్రదించింది.

వారి సహాయంతో – మధుమేహం, గుండెజబ్బులు లేని 50-75 ఏళ్ల మధ్య వయసున్న 94 మంది స్వచ్ఛంద కార్యకర్తలను ఎంపిక చేసుకున్నారు. వీరంతా  వివిధ రకాల కొవ్వు పదార్థాలను తినడం వల్ల వారిలో వచ్చే మార్పులను సమీక్షించాలని నిర్ణయించారు.  అనంతరం వీరిని మూడు బృందాలుగా విభజించారు.  నాలుగు వారాల పాటు ఒక బృందానికి 50 గ్రాములు, అంటే సుమారు 3 టేబుల్ స్పూన్‌ల ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనెను ఇచ్చారు. రెండో బృందానికి అంతే పరిమాణంలో ఎక్స్‌ ట్రా వర్జిన్ ఆలివ్ నూనెను తీసుకోమన్నారు. మూడో బృందానికి రోజూ 50 గ్రాముల ‘ ఉప్పు లేని’ వెన్నను తీసుకోమన్నారు.

వాలంటీర్లు తమకు ఇష్టం వచ్చిన రీతిలో నాలుగు వారాల పాటు ఈ కొవ్వు పదార్థాలను తీసుకోమని పరిశోధకులు సూచించారు.  అయితే, ఇలా రోజూ 450 అదనపు కెలోరీలను  నూనెల రూపంలో ఆహారంగా తీసుకోవడం వల్ల వారి బరువు పెరిగే అవకాశం ఉందని వారిని ముందే హెచ్చరించారు.

ఈ ప్రయోగానికి ముందు వారి రక్త నమూనాలు తీసుకుని ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) శాతాలను కొలవడం జరిగింది. వీటి ద్వారా గుండెపోటు వచ్చే రిస్క్ ను బాగా గుర్తించవచ్చు. చివర్లో ఫలితాలను గమనించినపుడు వెన్న తిన్నవారిలో సగటున 10 శాతం ఎల్‌డీఎల్ పెరగ్గా, అదే సమయంలో హెచ్‌డీఎల్ 5 శాతం పెరిగింది. ఆలివ్ ఆయిల్‌ను తీసుకున్న వారిలో చాలా తక్కువ శాతమే అయినా ఎల్‌డీఎల్ తగ్గగా, హెచ్‌డీఎల్ 5 శాతం పెరిగింది. అలా ఆలివ్ ఆయిల్ గుండెకు మంచిదన్న పేరు నిలబెట్టుకుంది.

కానీ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఫలితాలు కొబ్బరినూనెలో వెలువడ్డాయి. బీబీసీ అంచనా వేసినట్లు ఎల్‌డీఎల్ పరిమాణం పెరగకపోవడమే కాకుండా, హెచ్‌డీఎల్, అంటే మంచి కొలెస్టరాల్ 15 శాతం పెరిగినట్లు తేలింది. అంటే కొబ్బరి నూనెను తీసుకుంటున్న వారికి గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందన్న మాట.

మరికొన్ని పరిశోధనలు అవసరం.. .. 

దీనిపై   ప్రొఫెసర్ కే-టీ ఖాను   మాట్లాడుతూ.. ”బహుశా కొబ్బరి నూనెలోని ప్రధానమైన సంతృప్త కొవ్వు పదార్థం లారిక్ యాసిడ్ రూపంలో ఉండడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు” అని అన్నారు.

అంటే కొబ్బరి నూనెను మనం ఆరోగ్యకరమైన ఆహారం అనవచ్చా? అని అడిగినపుడు ”ఇది ఒక పరిశోధన మాత్రమే. ఒక పరిశోధన ఎంత బాగా జరిగినా, కేవలం దీని ఆధారంగా ఆహార అలవాట్లలో మార్పు చేసుకోమని సూచించడం బాధ్యతా రాహిత్యమే అవుతుంది” అన్నారామె.

అందువల్ల కొబ్బరి నూనె ఒక ‘సూపర్ ఫుడ్’ అని ఇప్పుడే ప్రకటించలేము. కానీ, మీరు వంటల్లో కొబ్బరి నూనెను వాడుతుంటే మాత్రం, దానిని వెంటనే మానివేసి, మరో నూనెకు వెళ్లవలసిన అవసరం లేదని మాత్రం గ్రహించగలరు.

 

మామాట: ఆ నూనె, ఈనూనె.. ఏ నూనె అయితే ఏమిరా… జీవానికీ

Leave a Reply