అఖిలప్రియ టీడీపీకి గుడ్‌బై చెప్పనుందా…!

Share Icons:

కర్నూలు, 10 జనవరి:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. సొంత పార్టీల మీద అసంతృప్తితో ఉన్న నేతలు ఇతర పార్టీల కండువాలు కప్పుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారిపోగా…మరికొందరు అదే పనిలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే అధికార టీడీపీ మీద అసంతృప్తితో ఉన్న నేతలు వైసీపీ, జనసేనలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉండి కూడా, తమ అనుచరులపై జరుగుతున్న పోలీసుల దాడులను ఆపలేకపోయానన్న మనస్తాపంలో ఉన్న ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల అఖిల ప్రియ ప్రధాన అనుచరుల్లో ఒకరైన సంజీవ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి, పీడీ యాక్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అఖిలప్రియ, తన గన్ మెన్లను వెనక్కు పంపించేశారు. ఇక అక్కకి మద్దతుగా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా తన గన్‌మెన్లని వెనక్కి పంపారు.

అలాగే సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా కర్నూలు జిల్లాకు వచ్చి జన్మభూమి కార్యక్రమంలో కూడా అఖిల ప్రియ పాల్గొనలేదు. అలాగే గన్‌మెన్లని వెనక్కి పంపడంపై హోమ్ మంత్రి చినరాజప్ప కూడా అఖిలకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు.

పార్టీలో ఏమన్నా సమస్యలు ఉంటే పెద్దలతో చర్చించాలని, అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదు అన్నారు. అఖిల ప్రియ పద్ధతి మార్చుకోవాలని, తన సంగతి అధినేత చూసుకుంటారని హెచ్చరించారు.

ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురయిన ఆమె పార్టీ మారనుందని అధికార పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అసలు అఖిలప్రియ మనసులో ఏముందన్న విషయం మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఒకవేళ పార్టీ మారితే…వైసీపీలోకి వెళతారా…లేక జనసేనలోకి వెళతారా అనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

మామాట: ఏకంగా మంత్రే పార్టీ మారితే టీడీపీకి కష్టాలు తప్పవు…

Leave a Reply