IPL: ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా..? ఏయే మార్గాల్లో డబ్బులొస్తాయి?

Share Icons:
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెట్ లీగ్‌గా పేరొందింది. గత 13 ఏళ్లుగా అభిమానులను అలరిస్తోన్న .. యువ క్రికెటర్ల పాలిట వరంలా మారింది. ఈ లీగ్‌లో రాణిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల నుంచి విలువైన చిట్కాలు నేర్చుకునే అవకాశం వారికి లభిస్తుంది. అభిమానులకు ఎంటర్‌టైన్మెంట్, ఆటగాళ్లకు కాసుల వర్షం పంచుతున్న ఐపీఎల్.. ఆర్థికంగా ఎలా విజయవంతమైంది..? ఫ్రాంఛైజీలకు డబ్బులు ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం.

స్పాన్సర్లు, మీడియా హక్కులు

ఐపీఎల్ ప్రధాన ఆదాయ వనరు స్పాన్సర్లు, మీడియా హక్కులు. 2020 ఐపీఎల్‌కు డ్రీమ్ ఎలెవన్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. సియాట్, క్రెడ్, పేటీఎం, అన్ అకాడమీ, ఆల్ట్రోజ్ కూడా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. స్పాన్సర్లు బీసీసీఐకి కోట్లాది రూపాయలు చెల్లిస్తారు. 2018 నుంచి 2022 వరకు ఐదేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కోసం.. స్టార్ ఇండియా బీసీసీఐకి ఏకంగా రూ.16 వేల 347 కోట్లు చెల్లిస్తోంది.

మీడియా హక్కులు, టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా సమకూరే ఆదాయాన్ని సెంట్రల్ పూల్‌గా ఏర్పాటు చేస్తారు. ఇందులో 50 శాతం వాటా బీసీసీఐకి, 45 శాతం ఫ్రాంచైజీలకు వెళ్తుంది. 5 శాతాన్ని ఫ్రైజ్ మనీగా ఇస్తారు. ఏటా బీసీసీఐకి ఐపీఎల్ ద్వారానే రూ. 2 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.

లోకల్ స్పాన్సర్లు:
ఐపీఎల్‌లో ప్రతి జట్టుకు కొందరు స్పాన్సర్లు ఉంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలు, హెల్మెట్ల మీద స్పాన్సర్ల పేర్లు కనిపిస్తుంటాయి. ఇలా కనిపించడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకుంటారు. ఈ స్పాన్సర్ల ద్వారానూ జట్లకు ఆదాయం సమకూరుతుంది.

టికెట్ల విక్రయం:
ఇప్పుడంటే కరోనా ఎఫెక్ట్ ఉంది గానీ.. మాములు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియాలన్నీ నిండిపోతాయి. హోం గ్రౌండ్లో ఆడే మ్యాచ్‌ల్లో టికెట్ల విక్రయం రూపంలో ఫ్రాంచైజీలకు ఆదాయం సమకూరుతుంది. స్టేడియం యజమానులకు కొంత మొత్తం ఇచ్చినా ఫ్రాంచైజీలకు కొంత మిగులుతుంది. గేట్ రెవెన్యూ ద్వారా ఫ్రాంచైజీలకు ఏటా రూ. 15 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది.

ప్రైజ్ మనీ:
ఆటగాళ్లను మార్చుకోవడం, తమ బ్రాండ్‌తో టీ షర్టులు, క్యాప్‌లు తదితర వస్తువుల విక్రయం ద్వారా కూడా ఫ్రాంచైజీలకు డబ్బు సమకూరుతుంది. సాధారణంగా ఐపీఎల్‌ టైటిల్ గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.11 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కుతుంది. కానీ ఈ సీజన్లో ఐపీఎల్ ప్రైజ్ మనీని బీసీసీఐ సగానికి తగ్గించింది.

ఖర్చు ఇలా..
ప్రతి ఫ్రాంచైజీ.. తమ ఫైనల్ బిడ్ మొత్తంలో ఏటా పది శాతాన్ని ఐపీఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలకయ్యే ప్రధాన ఖర్చు ఆటగాళ్ల జీతాలు, ఇతర ఖర్చులు. ఫ్రాంచైజీలకు వచ్చే రెవెన్యూలో 35-45 శాతం వరకు ఆటగాళ్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు ప్రభుత్వానికి అనేక విధాలుగా.. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

పదేళ్ల తర్వాత లాభాల్లోకి..
ఐపీఎల్ ప్రారంభం కాగానే ఫ్రాంచైజీలన్నీ లాభాలను ఆర్జించలేదు. 2008లో లీగ్ ప్రారంభం కాగా.. 2017 వరకు అన్ని ఫ్రాంచైజీలకు లాభాలు రాలేదు. ఆరంభంలోనే కొన్ని లాభాల్లోకి వెళ్లగా.. మరికొన్ని ఆలస్యంగా లాభాల బాట పట్టాయి.

2020లోనూ లాభాలే..
2020 సీజన్లో కరోనా ఎఫెక్ట్.. వివో స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలడంతో.. ఫ్రాంచైజీల ఆదాయం తగ్గింది. వివో స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలడంతో ఒక్కో జట్టు రూ.13 కోట్లకుపైగా నష్టపోయింది. జట్ల స్పాన్సర్లు కూడా మారిపోవడంతో డిస్కౌంట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతుండటంతో.. రూ.15-25 కోట్లకుపైగా గేట్ రెవెన్యూ లేకుండా పోయింది. బీసీసీఐ ప్రైజ్ మనీని సైతం సగానికి తగ్గించింది. కానీ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం బీసీసీఐకి స్టార్ స్పోర్ట్స్ రూ.3 వేల కోట్లకుపైగా ఇస్తుండటంతో ఫ్రాంచైజీలన్నీ లాభాల్లోనే ఉంటాయి.