IPL ఫైనల్‌కు ముందు.. ఢిల్లీ మనో స్థైర్యం దెబ్బతీసేలా.. రోహిత్ వ్యూహాత్మక వ్యాఖ్యలు

Share Icons:
ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌‌కు ముందు ముంబై ఇండియన్స్ బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌పై కెప్టెన్ ప్రశంసలు గుప్పించాడు. కొత్త బంతితో అత్యుత్తమ బౌలింగ్ చేయగల బౌల్ట్‌ను ఢిల్లీ నుంచి కొనుగోలు చేయడం అదృష్టమన్నాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేసే బౌల్ట్ ముంబై ఇండియన్స్‌లో ఎవర్నీ డిజప్పాయింట్ చేయలేదన్నాడు. ఢిల్లీతో ఫైనల్ ముందు మానసికంగా పై చేయి సాధించేలా రోహిత్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘మా జట్టును చూడండి.. జట్టు బలం, సమతూకం చూడండి. నిజాయతీగా చెబుతున్నా ఎవరూ మా బలహీనత ఇదీ అని ఎత్తి చూపలేరు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఢిల్లీతో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గాయపడి మైదానాన్ని వీడిన బౌల్ట్.. ఫైనల్లో బౌల్ట్ బరిలో దిగుతాడని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్ 22 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ (29) తొలి స్థానంలో ఉండగా.. బుమ్రా 27 వికెట్లతో రెండో స్థానంలో.. బౌల్ట్ మూడో స్థానంలో ఉన్నారు. 2018, 2019 ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన బౌల్ట్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు ముంబై కొనుగోలు చేసింది.