కన్నడ రాజకీయాలు: ప్రతిపక్ష నేత ఎవరో? ఉపఎన్నికలు ఖాయమేనా!`

congress and jds leaders sensational comments on bjp
Share Icons:

బెంగళూరు:

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూప్పకూలి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ లకు సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలతో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ అధికారంలోకి…కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రతిపక్షంలోకి వెళ్ళాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే కాంగ్రెస్ అధిస్థానం పార్టీకి విధేయుడిగా ఉన్న లింగాయత్ నేత హెచ్‌కే పాటిల్‌ను శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, మాజీ డిప్యూటీ సీఎం డీజీ పరమేశ్వర్, మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండేలు కూడా ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.  అయితే, పాటిల్‌కే ఆ పదవి అప్పజెప్పాలని పలువురు నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పార్టీ అసమ్మతి నేతలే పడగొట్టడంపై సోనియా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కేపీసీసీకి కొత్త అధ్యక్షుడు, పదాధికారుల నియమాకం, జిల్లాలకు నూతన అధ్యక్షులు, శాసనసభ, విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేతల ఎంపిక వంటి వాటిపై సోనియా చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో పాల్గొనేందుకు కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు, మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్-జేడీఎస్ లకు సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వీరు కోర్టు మెట్లు ఎక్కిన ఫలితం కనిపించేలా లేదు. కొందరు న్యాయనిపుణులు చెబుతున్న ప్రకారం స్పీకర్ వేసిన అనర్హత వేటు పై న్యాయస్థానం తిరిగి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితులని చూస్తుంటే ఉప ఎన్నికలు అనివార్యమే.

ఇక ఉప ఎన్నికలు జరిగితే అనర్హత వేటు పడిన వారు తిరిగి పోటీ చేసే అవకాశం లేదు. ఉప ఎన్నికలు గ్యారంటీ అని దాదాపుగా తెలియడంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు హస్తినలో మకాం వేసి బీజేపీ అధిష్టానం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. అందుకోసమే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల కోసం యడ్యూరప్ప ప్రత్యేకంగా ఒక ప్లాన్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 17 మంది ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు ఉప ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం ఒకటి. లేదా వారు సిఫార్సు చేసిన వారికి ఇచ్చే అవకాశముంది.

దీంతోపాటు అన్హత వేటు పడిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కూడా యడ్యూరప్ప జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన త్వరలోనే వారిని కలిసి వివరించనున్నట్లు చెబుతున్నారు

Leave a Reply