కరణం ఎంట్రీతో మారిన చీరాల రాజకీయం: ఆమంచి అలకపాన్పు ఎక్కారా?

Share Icons:

చీరాల: టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తాజాగా వైసీపీకి మద్ధతుగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు వెంకటేష్ కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. చీరాలలో బలరాంనకు మద్దతిచ్చిన, లేక టీడీపీలో ఉన్న ముఖ్య నాయకులంతా ఆయన వెంటే నడిచారు. మాజీ మంత్రి పాలేటి రామారావు, జంజనం శ్రీనివాసరావు లాంటి నాయకుల నుంచి కిందిస్థాయి వరకూ ముఖ్యులంతా వైసీపీ కండువాలు కప్పుకున్నారు.

బలరాం, ఆయన మద్దతుదారులు వైసీపీలో చేరిక కార్యక్రమానికి ఆమంచి కృష్ణమోహన్‌ కానీ, అతనితో ఉన్న వైసీపీ ముఖ్య నాయకులు కానీ హాజరు కాలేదు. మరోవైపు ఇటీవల ఆపార్టీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత, గతం నుంచి వైసీపీలో ఉన్న డాక్టర్‌ అమృతపాణి తదితర ముఖ్యులు బలరాంతో పాటు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన వర్గీయులు తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బలరాం చేరిక కార్యక్రమానికి ఆమంచితో పాటు, ఆయన వర్గీయులంతా దూరంగా ఉన్నారు.

కృష్ణాజిల్లా గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వంశీని చేరదీసిన ముఖ్యమంత్రి జగన్‌ అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు.ఇక్కడ ఎలాంటి పంథాను అవలంబిస్తారన్న విషయం పక్కనబెడితే పాలనాపరమైన అంశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని బలరాంనకు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

అటు కరణం వైసీపీలోకి వెళ్లడమే టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను యడం బాలాజీకి ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు ఫోన్‌లో బాలాజీతో కూడా ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన బాలాజీ ఓటమి చెందారు. ఆతర్వాత ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగారు. గత ఎన్నికల సమయంలో ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరడంతో బాలాజీ టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. చీరాలలో టీడీపీ తరఫున పోటీ చేసిన బలరాం గెలుపునకు కృషి చేయటమే గాక చంద్రబాబునూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

 

Leave a Reply