ఆసక్తికరంగా గూడూరు రాజకీయం…

Share Icons:

నెల్లూరు, 22 మార్చి:

‘కుడి ఎడమైతే పొరపాటే లేదోయ్’ అనే సూక్తి గూడూరు రాజకీయాలకి కరెక్ట్‌గా సరిపోతుంది. గత ఎన్నికలలో కలిసి ప్రచారం చేసినవారు, ఇప్పుడు కత్తులు దూసుకుంటూ కదనరంగంలో కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో వైకాపా నుండి పాశిం సునీల్‌కుమార్‌ గూడూరు అసెంబ్లీకి, తిరుపతి పార్లమెంటుకు వరప్రసాద్‌లు కలిసి పోటీ చేసి ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికలలో ఇద్దరూ విజయం సాధించారు. అయితే పాశం ఆతర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ దఫా గూడూరు అసెంబ్లీకి టీడీపీ తరపున పాశిం సునీల్‌కుమార్‌, వైసీపీ తరపున మాజీ పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్‌ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. నాడు కలసి ప్రచారం నిర్వహించిన వీరే నేడు ప్రత్యర్థులుగా మారారు.

మరోవైపు గూడూరు నియోజకవర్గంలో 2009, 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పనబాక కృష్ణయ్య పోటీ చేశారు. ఆ ఎన్నికలలో పనబాక కృష్ణయ్యకు పోటీగా టీడీపీ తరుపున దుర్గాప్రసాద్‌ రావు తలపడ్డారు. 2014లో మాత్రం టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. ప్రస్తుత ఎన్నికలలో పనబాక కృష్ణయ్య పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆయన సతీమణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంటు టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఆమెకు ప్రత్యర్థిగా వైసీపీ తరపున దుర్గాప్రసాద్‌రావు పోటీ చేస్తున్నా రు.

పైగా గత అసెంబ్లీ ఎన్నికలలో పనబాక కృష్ణయ్యకు పోటీగా అసెంబ్లీకి తలపడిన పాశిం సునీల్‌కుమార్‌ ప్రస్తుతం పనబాక దంపతులకు మద్దతుగా పార్లమెంటు ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా మొత్తానికి గూడూరు, తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఆసక్తికర ఫైట్ జరగనుంది.

మామాట: రాజకీయాలు అంటే అంతేగా

Leave a Reply