ఊహించని మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలు….

interest turns in maharashtra politics...
Share Icons:

ముంబయి: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బీజేపీ-శివసేనల మధ్య సీఎం కుర్చీపై పేచీ ఉండటంతో కొత్త ప్రభుత్వం విషయం తేలడం లేదు.  సీఎం కుర్చి మాదంటేమాదేనని రెండు పార్టీలు మాటాల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఏక్‌నాథ్‌ షిండేను శివసేన శాసనసభాపక్ష నేత ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ…. తమకు ఎలాంటి అధికార దాహం లేదని, అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో సగం-సగం అధికార పంపిణీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అంగీకరించినందున, దానికి వాస్తవరూపం కల్పించాలనే తాము కోరుతున్నామన్నారు. ‘ముఖ్యమంత్రి పదవి ఎప్పుడూ ఏ ఒక్కరికో శాశ్వతం కారాదు. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన సత్తా చాటుకుంది. సేనకు చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి దక్కడం సబబు’ అని ఉద్ధవ్ అన్నారు.

ఇదిలా ఉంటే  ఎన్‌సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌ నివాసానికి శివసేన సీనియర్‌ నాయకుడు సంజయ్‌ రౌత్‌ వెళ్లి కీలక మంతనాలు సాగించారు. ఒకవేళ శివసేన గనక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఎన్‌సీపీ-కాంగ్రె్‌స కూటమి మద్దతిస్తుందా….. అని ఆయన ఆరా తీసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కాకలు తీరిన రాజకీయ యోధుడైన పవార్‌ అంత సులువుగా బయటపడలేదని, బీజేపీతో బంధం తెంచుకుని శివసేన బయటకు వస్తేనే విషయం ముందుకు కదులుతుందని చెప్పినట్లు తెలుస్తోంది.

అటు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు వివిధ పక్షాల ఎమ్మెల్యేలు మద్ధతు ప్రకటించారు. పలు చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర శాసనసభ్యులు దేవేంద్ర ఫడ్నవీస్‌ ను కలిసి తాము ప్రభుత్వ ఏర్పాటుకు మద్ధతు ఇస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య పోరు సాగుతున్న నేపథ్యంలో పలు చిన్న పార్టీలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌కు జై కొట్టారు.

కాగా, 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ప్రతిపక్ష ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు కైవలం చేసుకున్నాయి. 17మంది బీజేపీ రెబల్స్‌ గెలువడంతో వారి మద్దతు తమకే ఉంటుందన్న ధీమాతో ఉన్న బీజేపీ శివసేన డిమాండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు కాషాయపార్టీల నడుమ ఎలాంటి డీల్‌ కుదురుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 

Leave a Reply