రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భారత్-ఇటలీ ద్వైపాక్షిక సహకారం

Share Icons:

 కొత్త డిల్లీ, అక్టోబర్ 31 ,

రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవాలని భారత్,ఇటలీ దీదేశాలు నిర్ణయించుకున్నాయి. దిల్లీకి వచ్చిన ఇటలీ ప్రధాని జుసపె కాంటేకి ప్రధాని నరేంద్రమోదీ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను కల్పిస్తున్న దేశాల తీరును రెండు దేశాలూ ఖండించాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణాలకు లోబడి అనుసంధానత సంబంధిత అంశాలు ఉండాలని పేర్కొన్నాయి. అనంతరం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వం కల్పించడానికి కావాల్సిన సహకారాన్ని అందిస్తామని ఇటలీ హామీ ఇచ్చినట్లు రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. రక్షణ పరమైన సంబంధాలు చిరకాలం కొనసాగాలని, పరస్పరం ప్రయోజనదాయకంగా నిలవాలని ఉభయ పక్షాలూ ఆకాంక్షించినట్లు వివరించింది.

ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు మొదలైన తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇటలీ దృష్టి సారించింది. ఇటలీ రక్షణరంగ తయారీ కంపెనీలు భారత్‌కు వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా, భారతీయ కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం కుదుర్చుకోవాల్సిందిగా మోదీ ఈ చర్చల్లో కోరినట్లు ప్రకటన తెలిపింది. పరస్పరం పెట్టుబడులను ప్రోత్సహించుకుని, వివాదాలేమైనా ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు తగిన వ్యవస్థను నెలకొల్పుకోవాలని ఉభయ దేశాలూ నిర్ణయించుకున్నాయి.

రైల్వే, మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం, విద్య, నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భావించాయి. భారత్‌-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పరస్పరం లబ్ధిదాయకంగా రూపొందించుకునేందుకు తిరిగి చర్చలు ప్రారంభించాలని నిర్ణయించాయి.

మామాట: ఇరుగు-పొరుగుతో సహకారం మంచిదే కదా…

Leave a Reply