Header Banner
Header Banner
TRENDING NOW

మన ఎన్నికల్లో ఇవిఎంలు, వివిప్యాట్లు విప్లవాత్మకం

మన ఎన్నికల్లో ఇవిఎంలు, వివిప్యాట్లు విప్లవాత్మకం
హైదరాబాద్, నవంబర్ 13 ,
ఇవిఎంలు, వివిప్యాట్ యంత్రాల రంగ ప్రవేశం తరువాత భారత దేశంలో ఎన్నికల నిర్వహణ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయనీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్ చెప్పారు. 3ఎం టెక్నాలజీతో పనిచేసే  ఈ యంత్రాలు కచ్చితత్వం, పారదర్శకత వీటి ద్వారా పరోక్షంగా లభించే నిష్పాక్షికత ఎంతగా  అభివృద్ధి చెందాయంటే వాటి చెల్లుబాటు విషయంలో వంద శాతం విజయాన్ని చవి చూసాయన్నారు.  హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో   వీటికి వ్యతిరేకంగా దాఖలయిన 37 కేసులను విజయవంతంగా అధిగమించామని ఆయన తెలిపారు.
1952లో పేపర్ బ్యాలట్‌తో మొదలయిన భారత ఎన్నికల చరిత్ర ఇప్పుడు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసే అధునాతన సాఫ్ట్‌ వేర్, అక్రమాలకు తావులేని  యంత్రాలతో  దూసుకుపోతున్నదని, ప్రత్యర్థుల సంఖ్య పెరిగినా,  కరెంటుకోతల వంటి ప్రతికూల పరిస్థితులెదురయినా నిరంతరాయంగా పనిచేసుకు పోతున్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని ఆకాశవాణి కార్యాలయంలో  ‘ఎన్నికల వార్తా ప్రసారాలు’ అనే అంశంపై ఆకాశవాణి జిల్లా విలేకరులకు మంగళవారం నిర్వహించిన ఒక చర్చాగోష్ఠిలో  రజత్ కుమార్ కీలకోపన్యాసం చేసారు.
సమాచార సేకరణ, ప్రసారాలలో ఇతర ప్రైవేటు మీడియాతో పోటీకి పోయి సంచలనాలకోసం  ఆకాశవాణి వార్తలకున్న విశ్వసనీయత కోల్పోవద్దని, ఓటర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించేవిధంగా సరైన సమాచారం అందించాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి  రాష్ట్రం చాలా విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికలలో సమాచారం కుప్పలుతెప్పలుగా వస్తుండడంతో దానిని సక్రమంగా, కచ్చితంగా ప్రజలకు అందించడం సవాలుగా మారుతున్నదని చెవుతూ, ఈ విషయంలో బాధ్యతగల ప్రచార సాధనాలుగా ఆకాశవాణి, దూరదర్శన్‌లు మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. సరైన సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజాస్వామ్యానికి అసలు సినలు ప్రతినిధులనిపించుకోవాలని పాత్రికేయులకు, ముఖ్యంగా ఆకాశవాణి, దూరదర్శన్ విలేకరులకు ఆయన ఉద్బోధించారు.
సంచలనాలకుపోయి విశ్వసనీయత కోల్పోకండి, నిష్పాక్షికతతో కచ్చితమైన సమాచారం ఇవ్వండి, ప్రత్యే క కథనాలు, ఆసక్తికర కథనాలు ప్రసారం చేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల కమీషన్ ఈ ఏడాదికి ప్రత్యేకంగా చేపట్టిన ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ అనే నినాదం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో దివ్యాంగులకు కూడా పెద్దఎత్తున భాగస్వామ్యం కల్పించడానికి చేపట్టిన అనేక కార్యక్రమాలను ఆయన వివరించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి ఆకాశవాణి విలేకరులతోపాటూ ఆకాశవాణి సిబ్బంది, అధికారులు కూడా హాజరయిన ఈ కార్యక్రమంలో పిఐబి అదనపు డిజి  టి.వి.కె. రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్  అల్లం నారాయణ,  న్యూఢిల్లీ ఆకాశవాణి వార్తా విభాగం అదనపు డిజి  ఆకాశ్ లక్ష్మణ్,  హైదరాబాద్ విభాగం అధిపతి సుప్రశాంతి దేవి ప్రభృతులు పాల్గొన్నారు.
మామాట: మంచి మాటలు చెప్పారు వినేవారు ఏరీ… చూద్దాం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: