రెచ్చిపోయిన రైనా, రాహుల్..సిరీస్ భారత్ కైవసం..

India won the t-20 series against Ireland
Share Icons:

డబ్లిన్, 30 జూన్:

టీమిండియా ఆటగాళ్లు కే‌ఎల్ రాహుల్, రైనాలు తమదైన శైలిలో రెచ్చిపోయి ఆడటంతో డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైనా రెండో టీ-20 లో భారత్ 143 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే టీ20ల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కాగా, సంయుక్తంగా రెండో అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసిన జట్టుగా ఐర్లాండ్ రికార్డులకెక్కింది.

ఇక మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 213/4 పరుగులు చేసింది. కే‌ఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. అనంతరం రైనాతో జతకలిసిన రాహుల్‌తో కలిసి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. దీంతో తొలి 10 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటింది.

అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ 13వ ఓవర్‌లో ఔట్‌కావడంతో రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇంకో రెండు బంతుల తర్వాత రోహిత్ (0) డకౌటయ్యాడు. రైనా, మనీష్ పాండే (20 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) కలిసి వేగంగా ఆడి నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) కళ్ళు చెదిరే స్థాయిలో నాలుగు భారీ సిక్సర్లు బాదడంతో ఐదో వికెట్‌కు అజేయంగా 44 పరుగులు జోడించడంతో భారత్ 213 పరుగులు చేసింది.

అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (15) టాప్ స్కోరర్. పోర్టర్‌ఫీల్డ్ (14), థాంప్సన్ (13)తో సహా అందరూ విఫలమయ్యారు. స్పిన్నర్లు కుల్దీప్ (3/16), చాహల్ (3/21) దాటికి ఐర్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. తన బ్యాటింగ్‌తో అదరగొట్టిన రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్…చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.

మామాట: మన వాళ్ళ సత్తా ఏంటో ఇంగ్లండ్ సిరీస్‌లో తెలుస్తుంది…

Leave a Reply