రెండు రోజుల్లోనే ముగిసిన చారిత్రక టెస్ట్…

india-won-the-single-test-match-against-afghanistan
Share Icons:

బెంగళూరు, 15 జూన్:

బెంగళూరు చినస్వామి స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన ఏకైక చారిత్రక టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది.

భారత్ బౌలర్ల దెబ్బకి పసికూనలు బెంబేలెత్తిపోయారు. ముందుగా బ్యాట్స్‌మెన్‌ చెలరేగగా, అనంతరం బౌలర్లు చకచకా వికెట్లు తీయడంతో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించింది.

మొదట టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 474 పరుగులకు ఆలౌట్ అయింది. మురళీ విజయ్ (105), ధావన్ (107)లు శతకాలతో విరుచుకుపడ్డారు.

కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన ఆఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ కేవలం రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్తాన్ బ్యాట్స్‌మెన్ వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. 109 పరుగులకే చేతులెత్తేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 4, ఇషాంత్ శర్మ, జడేజాలు చెరో రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.

ఆ తర్వాత అఫ్గాన్ జట్టు 365 పరుగులు వెనకపడి ఉండటంతో ఫాలో ఆన్ ఆడింది. ఇక ఈ రెండో ఇన్నింగ్స్ లో సైతం భారత బౌలర్లకు మోకరిల్లింది. 103 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో జడేజా సత్తా చాటి 4 వికెట్లు పడగొట్టాడు.

ఉమేష్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు. దీంతో, అంతర్జాతీయ క్రికెట్ లో తన టెస్ట్ కెరీర్ ను అఫ్గాన్ జట్టు ఓటమితో ప్రారంభించినట్టైంది. ఇక సెంచరీతో చెలరేగిన శిఖర్ ధావన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

మామాట: మొత్తానికి మన బౌలర్లు పసికూనలకి చుక్కలు చూపించారు…

Leave a Reply