బౌలర్ల జోరు….కివీస్ బేజారు…

Share Icons:

బే ఓవల్, 26 జనవరి:

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శనివారం బే ఓవల్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం సాధించింది.
భారత్ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
భారత్ బౌలర్ల జోరు ముందు కివీస్ 234 పరుగులకే అలౌట్ అయింది. దీంతో భారత్ సిరీస్ లో 2-0 తో ముందంజలో ఉంది. ఇక కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని సాధించి పెట్టాడు.
అలాగే భువనేశ్వర్ 2, చహల్ 2, షమీ 1, జాధవ్ 1 వికెట్ తీసుకున్నారు.

ఇక 325 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ మార్టిన్ గప్తిల్(15)ను ఔట్ చేసి భువనేశ్వర్ భారత్‌కు శుభారంభం అందించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో నిలకడగా కనీసం 50కి పైగా పరుగులు సాధిస్తూ వస్తున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులోకి రాగానే వేగంగా ఆడాడు. రెండు సిక్సర్లు బాది జోరు మీదున్న కేన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది.

ఆ తర్వాత మరో విధ్వంసకర ఓపెనర్ మున్రో(31)ను చాహల్ ఎల్బీడబ్లూగా వెనక్కి పంపడంతో 84 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్ పుంజుకోకుండా కివీస్ ఆటగాళ్లు టామ్ లాథమ్(34), హెన్రీ నికోల్స్(28), గ్రాండ్ హోం(3)లను పెవిలియన్ పంపి టీమిండియాకు విజయాన్ని ఖరారు చేశాడు. ఆఖర్లో బ్రాస్‌వెల్(57: 46 బంతుల్లో) ఫోర్లు, సిక్సర్లతో అర్ధశతకంతో మెరిసినా ప్రయోజనం లేకపోయింది.

87 పరుగులు చేసి భారత్ విజయానికి కృషి చేసిన రోహిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం జరగనుంది.
మామాట: విదేశాల్లోనూ ఇరగదీస్తున్న టీమిండియా….

Leave a Reply