పసికూనలకు చుక్కలు చూపించిన భారత్…

India won 1st t-20 against Ireland
Share Icons:

డబ్లిన్, 28 జూన్:

అటు బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (97; 61 బంతుల్లో 8×4, 5×6), శిఖర్‌ ధావన్‌ (74; 45 బంతుల్లో 5×4, 5×6)…ఇటు బౌలింగ్‌లో స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (4/21), చాహల్‌ (3/38) పసికూనలైన ఐర్లాండ్‌ జట్టుకి చుక్కలు చూపించారు.  దీంతో నిన్న డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ-20లో భారత్ జట్టు 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

మొదట టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ప్రత్యర్థుల బౌలింగ్‌లో పసలేకపోవడంతో రెండో ఓవర్ నుంచే బాదడం మొదలుపెట్టారు. ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రోహిత్.. ఈ మ్యాచ్‌లో మాత్రం దుమ్మురేపాడు.

ఇక 11వ ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్‌వికెట్‌లో భారీ సిక్సరు కొట్టిన ధవన్ 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే రోహిత్ కూడా బంతిని స్టాండ్స్‌లోకి పంపి హాఫ్ మార్క్‌ను అందుకున్నాడు. 16 ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ధావన్ వికెట్ సమర్పించుకున్నాడు.

దీంతో మొదటి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రైనా (10) వచ్చి రావడంతోనే బాదడం మొదలు పెట్టినా.. 18వ ఓవర్‌లో ఔటయ్యాడు. ఇక సెంచరీకి చేరువైన రోహిత్‌ను ఆఖరి ఓవర్‌లో చేజ్ (4/35) బోల్తా కొట్టించాడు.

తొలి బంతికి ధోనీ (11)ని ఔట్ చేసిన అతను రెండో బంతికి రోహిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో బంతికి కోహ్లీ (0)ని కూడా డకౌట్ చేయడంతో ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లు పడ్డాయి. చివరి బంతిని పాండ్యా హెలిక్యాప్టర్ షాట్‌తో సిక్సర్ కొట్టడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది.

ఇక 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్పిన్నర్లు చాహల్, కులదీప్ దెబ్బకి ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 132/9 స్కోరుకే పరిమితమైంది. దీంతో ఐర్లాండ్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం చెందింది. జట్టులో షానన్‌ (60) టాప్‌ స్కోరర్‌. నాలుగు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైనా రెండో టీ-20 రేపు జరగనుంది.

మామాట: పసికూనల మీద ప్రతాపం బాగానే చూపించారు…

Leave a Reply