పసికూనతో టీ-20 సమరానికి సిద్ధమైన కోహ్లీ సేన…..

India vs Ireland, 1st T20 International
Share Icons:

డబ్లిన్‌, 27 జూన్:

చాలా రోజుల విరామం తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ టీ-20 పోరుకు సిద్ధమైంది. కఠినమైన ఇంగ్లండ్‌ టూర్‌ ప్రారంభానికి ముందు టీమిండియా పసికూన ఐర్లాండ్‌తో రెండు టీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. అందులో భాగంగా ఇరుజట్ల మధ్య నేడు డబ్లిన్‌లో మొదటి టీ-20 మ్యాచ్‌ జరగనుంది.

అయితే శనివారం లండన్‌లో దిగిన కోహ్లీసేన ఓ రోజు విశ్రాంతి తర్వాత సోమవారం మార్చెంట్ టైలర్ స్కూల్ మైదానంలో పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేసింది. కాగా, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌ కలసి ప్రాక్టీస్ చేయగా, పక్కనే ఉన్న నెట్‌లో కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌ సాధన చేశారు. ఇక మిడిలార్డర్ రెండు స్థానాల కోసం సురేశ్ రైనా, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కీపర్/బ్యాట్స్‌మెన్‌గా ధోని స్థానం అలాగే ఉంటుంది.

ఇక బౌలింగ్‌ విషయానికొచ్చేసరికి చాహల్, కుల్దీప్‌లకు ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని విరాట్ భావిస్తున్నాడు. ఎందుకంటే ఇంగ్లండ్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలంటే వీళ్లకు మొదటి నుంచి ప్రాక్టీస్ అవసరమని కెప్టెన్ అభిప్రాయం.

అలాగే పేస్ బౌలింగ్‌లో భువనేశ్వర్, బుమ్రాకు తోడుగా ఉమేశ్‌ను పరీక్షించనున్నారు. మరోవైపు పసికూన ఐర్లాండ్ జట్టులో టీ20 అనుభవజ్ఞులకు కొదువలేదు. కెప్టెన్ గ్యారీ విల్సన్, విలియమ్ ఫోర్టర్‌ఫీల్డ్, ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రియాన్‌లు దూకుడుగా ఆడటంలో సిద్ధహస్తులు. అలాగే భారత సంతతికి చెందిన సిమ్రాన్‌జిత్ సింగ్‌పై అందరి దృష్టి నెలకొంది. అయితే మొత్తం మీద చేసుకుంటే టీమిండియాకు ఏమాత్రం సరిజోడి కాని ఐర్లాండ్ సంచలనమేదైనా చేస్తుందో చూడాలి.

జట్ల అంచనా..

భారత్‌: విరాట్‌ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌/మనీష్‌ పాండే, సురేష్‌ రైనా/దినేష్‌ కార్తీక్‌, ధోనీ, హార్దిక్‌, కుల్దీప్‌, చాహల్‌, భువనేశ్వర్‌, బుమ్రా.

ఐర్లాండ్‌: గ్యారీ విల్సన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఆండ్రూ బాల్‌బిర్నే, పీటర్‌ ఛేజ్‌, జార్ట్‌ డాక్రల్‌, జోష్‌ లిటిల్‌, ఆండీ మెక్‌బిర్నే, కెవిన్‌ ఒబ్రాయన్‌, పోర్టర్‌ ఫీల్డ్‌, స్టువర్ట్‌ పాంటర్‌, జేమ్స్‌ షానన్‌/రాన్‌కిన్‌, సిమ్ర న్‌జిత్‌ సింగ్‌.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మామాట: పసికూన అని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు…

Leave a Reply