కెప్టెన్…విజయం సాధించి పెట్టేనా?

India vs England test match
Share Icons:

బర్మింగ్‌హామ్‌, 4 ఆగష్టు:

ప్రస్తుతం క్రికెట్‌లో ఏ ఫార్మాట్ ఇష్టమని అభిమానులని అడిగితే…అందరూ ముందు టీ-20 మ్యాచ్ అనే చెబుతారు..ఇక మహా అయితే వన్డే మ్యాచ్‌ని కూడా ఇష్టపడుతున్నట్లు చెబుతారు.  కానీ టెస్ట్ మ్యాచ్ వైపు మొగ్గు చూపే అభిమానులే తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అది ఐదు రోజుల వరకు ఉంటుంది అంతా ఓపికగా చూడటం ప్రస్తుతం కష్టమనే చెబుతారు.

కానీ ఒక క్రికెటర్ మంచి ఆటగాడిగా ఎదగాలంటే అది టెస్ట్ మ్యాచ్ ద్వారానే సాధ్యం. అలాగే సరైనా ఒక టెస్ట్ మ్యాచ్ జరిగితే చాలు దాని ముందు టీ-20, వన్డే మ్యాచ్‌లు దిగతుడుపే అని చెప్పడానికి. అలా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు చరిత్రలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి టెస్ట్ మ్యాచే ఒకటి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతుంది.

ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ అనేక కీలక మలుపులు తిరుగుతూ ఆసక్తి రేపుతోంది. ఆధిపత్యం ఎప్పటికప్పుడు చేతులు మారుతూ..అభిమానులని టెన్షన్ పెట్టిస్తుంది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ 287 పరుగులకి ఆలౌట్ కాగా, భారత్ 274 పరుగులకి ఆలౌట్ అయింది.

ఇక 9/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు(శుక్రవారం) రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్..ఇషాంత్(5/51) ధాటికి 53 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. ఇషాంత్‌కు తోడు అశ్విన్(3/59), ఉమేశ్ యాదవ్(2/20) రాణించారు. టాపార్డార్‌ను అశ్విన్ కూల్చితే..మిగతా పనిని ఇషాంత్ లాంఛనంగా పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లండ్ భారత్ ముందు 194 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది.

అయితే స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఇప్పటికే సగం వికెట్లను చేజార్చుకుంది. బ్రాడ్(2/29)కు తోడు అండర్సన్(1/33), కుర్రాన్(1/17) బౌలింగ్‌తో భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విజయ్(6), ధావన్(13), రాహుల్(13), రహనే(2), అశ్విన్(13) తక్కువ పరుగులకే పెవిలియన్‌కి చేరారు.

ఇక ప్రస్తుతానికి కెప్టెన్ కోహ్లీ(76 బంతుల్లో 43 నాటౌట్, 3ఫోర్లు), దినేశ్ కార్తీక్(44 బంతుల్లో 18 నాటౌట్, 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దీంతో భారమంతా కెప్టెన్ మీదనే పడింది. ఇంకా భారత్ విజయం సాధించాలంటే 84 పరుగులు కావాల్సి ఉంది. మరి చూడాలి కెప్టెన్ కోహ్లీ జట్టుకి విజయం సాధించి పెడతాడో లేదో?

మామాట: ఒకే ‘ఒక్కడు’….!

Leave a Reply