సిరీస్ సమం చేయడం సులువేనా?

India vs england fourth test
Share Icons:

సౌథాంప్టన్‌, 30 ఆగష్టు:

తొలి టెస్టులో విజయం ముంగిట వరకు వచ్చి బోల్తా కొట్టారు…ఇక రెండో టెస్టులో అతి ఘోరంగా ఆడి పరాజయం చవి చూశారు. ఇక ఈ వైఫల్యాలని అధిగిమిస్తూ ఎవరు ఊహించని విధంగా మూడో టెస్టులో తమదైన శైలిలో రెచ్చిపోయి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుని మట్టికరిపించింది కోహ్లీ సేన… ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నాలుగో టెస్టులో బరిలోకి దిగుతోంది. అయితే జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో మరో విజయం సాధించి, ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.

సౌథాంప్టన్‌ వేదికగా ఈరోజు ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌కు కూడా పిచ్‌పై పచ్చిక ఉందని తేలడంతో పేసర్లు మరోసారి కీలకం కానున్నారు. అయితే మ్యాచ్‌కు ముందు పరిస్థితులను బట్టి రెండో స్పిన్నర్‌ను ఆడించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇదే జరిగే షమీ స్థానంలో జడేజా తుది జట్టులోకి రావొచ్చు. నడుం గాయం నుంచి అశ్విన్ కోలుకోవడం సానుకూలాంశం. మిగతా జట్టును యధావిధిగా ఆడించనున్నారు.

మరోవైపు ఇంగ్లండ్ మొయిన్ అలీ, సామ్ కుర్రాన్‌కు మళ్లీ అవకాశం ఇచ్చింది. వేలి గాయంతో బెయిర్‌స్టో బ్యాటింగ్‌కే పరిమితంకావడం, కొత్త కుర్రాడు పోప్ ఆకట్టుకోకపోవడంతో ఈ మార్పులు చేసింది. తొడ గాయంతో పేసర్ క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఓవరాల్‌గా వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నది. వాతావరణం పొడిగా ఉంది. కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌ని నిలువరించి సిరీస్‌ని సమం చేయడం భారత్‌కు సులువు అవుతుందో లేదో చూడాలి.

జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ, ధవన్‌, రాహుల్‌, పుజారా, రహానె, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, షమి, ఇషాంత్‌, బుమ్రా/ఉమేష్‌.

ఇంగ్లండ్‌: కుక్‌, కీటన్‌ జెన్నింగ్స్‌, జో రూట్‌, బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, బట్లర్‌, మొయిన్‌ అలీ, కర్రాన్‌, రషీద్‌, బ్రాడ్‌, ఆండర్సన్‌.

మామాట: సమిష్టిగా రాణిస్తే సులువే…!

Leave a Reply