చివర్లో దొరికారు….

Share Icons:

లండన్, 8 సెప్టెంబర్:

చివరి టెస్ట్ అయిన గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్న భారత్ జట్టు ఐదో టెస్ట్ తొలి రోజు శుభారంభం చేసింది. మొదటి రెండు సెషన్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 123 పరుగులతో పటిష్ట స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు చివరి సెషన్‌లో భారత్ బౌలర్లకి దొరికారు. ఇషాంత్, బుమ్రాకు తోడుగా జడేజా కూడా స్పిన్ మ్యాజిక్‌తో రూట్‌సేనను కట్టడి చేశారు. ఫలితంగా ఆతిథ్య జట్టు ఆట ముగిసేసరికి 198/7 పరుగులు చేసి ఆలౌట్‌కి దగ్గరగా ఉంది.

కెప్టెన్ రూట్ వరుసగా ఐదోసారి టాస్ గెలువడంతో.. మరో ఆలోచన లేకుండా ఇంగ్లండ్ ఓపెనర్లు కుక్ (71), జెన్నింగ్స్ (23) క్రీజులోకి వచ్చారు. ఆరంభంలో పిచ్ మీద ఉండే తేమను సద్వినియోగం చేసుకున్న ఇషాంత్ (3/28), బుమ్రా (2/41) వైవిధ్యమైన బంతులను వేసినా.. వికెట్ మాత్రం దక్కలేదు. దీంతో నిలకడగా పరుగులు చేస్తూ క్రమంగా కుదురుకున్నారు. కానీ 24వ ఓవర్‌లో భారత్‌కి తొలి ఫలితం దక్కింది. జడేజా టర్నింగ్ బంతిని ఆడబోయిన జెన్నింగ్స్ స్లిప్‌లో రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక లంచ్ తర్వాత అయితే భారత్ బౌలర్లు ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో టీ విరామానికి 123/1 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉంది.

ఇక తొలి రెండు సెషన్లలో బౌలర్లు ఎంత పోరాడినా ఒకే ఒక్క వికెట్ ఇచ్చిన ఇంగ్లండ్ చివరి సెషన్‌లో తడబడింది. స్కోరు బోర్డు మీద 10 పరుగులు జత చేసిన తర్వాత ఇన్నింగ్స్ 64వ ఓవర్‌లో బుమ్రా డబుల్ ఝలక్ ఇచ్చాడు. రెండో బంతికి కుక్‌ను, ఐదో బంతికి రూట్ (0)ను డకౌట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో ఇషాంత్.. బెయిర్‌స్టో (0)ను పెవిలియన్‌కు పంపాడు. 9 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు పడటంతో 133/1తో ఉన్న ఇంగ్లండ్ ఒక్కసారిగా 134/4కు పడిపోయింది.

అయితే కుక్, అలీ రెండో వికెట్‌కు 73 పరుగులు జత చేశారు. ఈ దశలో వచ్చిన స్టోక్స్ (11)ను జడేజా ఇబ్బందిపెట్టాడు. అలీ అలవోకగా పరుగులు చేసినా.. స్టోక్స్ నెమ్మదిగా ఆడాడు. 13 ఓవర్ల తర్వాత జడేజా స్లో బంతితో స్టోక్స్‌ను ఔట్ చేసి ఐదో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. నిలకడగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 83వ ఓవర్‌లో ఇషాంత్ మరోసారి ఝలక్ ఇచ్చాడు. మూడు బంతుల తేడాలో అలీ, కుర్రాన్ (0)ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

మామాట: మరి మనోళ్ళు బ్యాటింగ్‌లో ఏ మేర రాణిస్తారో?

Leave a Reply