ఇక గెలుపు కష్టమేనా…!

india vs england
Share Icons:

లండన్, 10 సెప్టెంబర్:

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైనా ఐదో టెస్టులో భారత్ గెలుపు కష్టమే అనిపిస్తోంది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకి ఆలౌట్ అయిన దానికి ధీటుగా మాత్రం భారత్ పరుగులు సాధించలేకపోయింది. కనీసం జడేజా, విహారీ అర్ధసెంచరీలు చేయడం వలన 292 పరుగులు చేసి పరువు దక్కించుకుంది. ఇక 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ప్రస్తుతం 2 వికెట్లకు 114 పరుగులు చేసి 154 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.

174/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్‌ఇండియా జడేజా, విహారీ బ్యాటింగ్‌తో 95 ఓవర్లలో 292 పరుగులు చేసింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును వీరిద్దరు ఒడ్డుకు పడేశారు. ఓవైపు ఇంగ్లండ్ పేస్ ద్వయం అండర్సన్, బ్రాడ్ తొలి గంటలో స్వింగ్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేసినా వికెట్ చేజార్చుకోకుండా బ్యాటింగ్ చేశారు.

ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఓవైపు జడేజా దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తే..మరోవైపు అరంగేట్రం మ్యాచ్‌లోనూ విహారీ సమయోచితంగా రాణించాడు. ఈ క్రమంలో 104 బంతుల్లో ఈ తెలుగు కుర్రాడు అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. జడేజాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. దీంతో వికెట్ కోల్పోకుండానే భారత్ భోజన విరామానికి వెళ్లింది. ఆ తర్వాత మొయిన్ అలీ(2/50)బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన విహారీ..వికెట్ సమర్పించుకున్నాడు. తన ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లినా.. నిరాశే ఎదురైంది.

అయితే 77 పరుగుల వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడ్డాక టెయిలెండర్ల సాయంతో జడేజా స్కోరు బోర్డుని 292 పరుగులకి చేర్చగలిగాడు.

ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. ఇక ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 114/2 పరుగులు చేసి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది.

మామాట: డ్రా అయిన చేయగలరా….!

Leave a Reply