చివరి మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా…3-1తో సిరీస్ కైవసం…

India Lose Final T20I Against South Africa But Clinch Series 3-1
Share Icons:

సూరత్: ఆరు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా మహిళా జట్టు ఓటమి పాలైంది. శుక్రవారం సూరత్ వేదికగా  జరిగిన ఆరో టీ20లో దక్షిణాఫ్రికా 105 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దుకాగా.. మిగిలిన మూడింట భారత్ నెగ్గింది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు ఓపెనర్లు లిజెల్లీ లీ (47 బంతుల్లో 84; 15 ఫోర్లు, 1 సిక్స్), సునె లుస్ (56 బంతుల్లో 62; 7 ఫోర్లు) అర్ధశతకాలతో కదంతొక్కడంతో భారీ స్కోరు చేసింది. ఈ జోడీ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 144 పరుగులు జోడించింది. గత మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించలేక 100 పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డ సఫారీలు ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 175/3 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతీ రెడ్డి, పూనమ్, హర్మన్‌ప్రీత్ కౌర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 13 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం తప్పదనుకుంటే వేద కృష్ణమూర్తి (26), అరుంధతి (22) విలువైన పరుగులు జోడించి కాస్తలో కాస్త పరువు కాపాడారు. షఫాలీ వర్మ (4), స్మృతి మంధన (5), జెమీమా రోడ్రిగ్స్ (0), హర్మన్‌ప్రీత్ కౌర్ (1), దీప్తి శర్మ (2), తానియా భాటియా (0) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 17.3 ఓవర్లలో 70 పరుగులకి ఆలౌట్ అయింది. ప్రత్యర్థి బౌలర్లలో డి క్లెర్క్ 3.. షబ్నమ్, బాష్, షాంగసే తలా 2 వికెట్లు పడగొట్టారు. లిజెల్లీ లీకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌అవార్డులు దక్కాయి.

 

Leave a Reply