ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది…!

Share Icons:

నేడు లంకతో తలపడనున్న భారత్….

కొలంబో, 12 మార్చి:

శ్రీలంకలో జరుగుతున్న నిదహాస్‌ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ పుంజుకుని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సిరీస్‌లో టీమ్‌ఇండియా శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అందులో భాగంగా నేడు టోర్నీలో నాలుగో మ్యాచ్‌లో శ్రీలంక, భారత జట్లు తలపడనున్నాయి.

ఇప్పటికే మూడు జట్లు తలోక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో సమానంగా నిలిచాయి. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే దానికి ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే గెలుపుతో పాటు నెట్ రన్ రేట్ కూడా కీలకం కానుంది.

ఇరు జట్ల బలాబలాలు….

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ వరుసగా విఫలమవుతుండడం ఆందోళన కలిగించే అంశం. తను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కెప్టెన్‌గా జట్టును నడపాల్సిన రోహిత్ తొందరగా పెవిలియన్ చేరుతుండడంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమవుతోంది. దీంతో తరువాతి బ్యాట్స్‌మెన్ పై ఒత్తిడి పెరుగుతోంది. తద్వారా బౌలర్లు స్వేచ్ఛగా బంతులు వేయలేకపోతున్నారు. అయినప్పటికీ బ్యాటుతో ధావన్, రైనాలు రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జట్టు మొత్తం కలిసి కట్టుగా ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.

అలాగే బౌలర్ల విషయానికొస్తే అనుభవలేమితో కూడిన భారత బౌలింగ్ లైనప్ ఈ మ్యాచ్‌లో అయినా పూర్తి స్థాయిలో సత్తాచాటాల్సిందే. స్పిన్ బౌలర్లు చహాల్, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నప్పటికీ గత రెండు మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియా పేస్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో వారు కంట్రోల్ గా బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉంది.

Kusal perera

మరోవైపు స్లోఓవర్ రేట్ కారణంగా శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్‌ తిశారతో లంక బరిలో దిగనుంది. ఇక సొంతగడ్డపై లంక బ్యాట్స్‌మన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా సూపర్ ఫాంలో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. లంక బౌ లర్లు ప్రత్యర్థులపై పెద్దగా ప్రభావం చూపలేకపోతుండడం భారత్ బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చే అంశం.

పిచ్-వాతావరణం

ప్రేమదాస పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఆకాశం మేఘావృతమై ఉండి రాత్రి వేళలో చిరుజల్లులు కురిసే అవకాశం. రాత్రి 7 గంటలకు డి-స్పొర్ట్స్ ఛానల్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

జట్లు (అంచనా)

భారత్: రోహిత్(కెప్టెన్), ధవన్, రైనా, రిషబ్/రాహుల్, మనీశ్, దినేశ్, విజయ్‌శంకర్, చహాల్, సుందర్, జైదేవ్, శార్దూల్/సిరాజ్.

శ్రీలంక: తిసార పెరీరా (కెప్టెన్), గుణతిలక, మెండిస్, పెరీరా, షనక, తరంగ, ధనంజయ, జీవన్, డిసిల్వా, చమీర, ఫెర్నాండో/లక్మల్

మామాట: ఆ కసి పట్టుదల ఉన్నాయా…..?

English summary:

India faces Sri Lanka in the fourth match of the Nidahas Trophy on Monday. Skipper Rohit Sharma will be desperate to get back to form as a resurgent India look to set their record straight against hosts Sri Lanka in the Nidahas Trophy Tri-Series.

Leave a Reply