శ్రీలంకవెళ్లడానికి వీసా అక్కరలేదు

Share Icons:

తిరుపతి, ఆగష్టు 09,

శ్రీలంక సందర్శించే భారత, చైనా పర్యాటకులకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు శ్రీలంక పర్యాటక శాఖ తెలిపింది. ఈ మేరకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు శ్రీలంక ప్రధాని రనీల్ విక్రమసింగే ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి అమరతుంగ తెలిపారు.

శ్రీలంక మిత్ర దేశాలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇది అమల్లోకి వస్తే ఇండియా, చైనా సహా పశ్చిమ ఆసియా, ఐరోపా దేశాలకు కూడా లబ్ది చేకూరనుందన్నారు. ఈ ప్రతిపాదనను అక్టోబరు నుంచి నవంబరు వరకు, మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో అమలు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. గతంలో ఈలం సమస్య వంటి పలు కారణాలతో శ్రీలంకకు పర్యాటకులు వెళ్లేవారు కాదు. కానీ, గత కొన్నేళ్లుగా శ్రీలంక వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15.3 శాతం వృద్ధి కనిపించింది. శ్రీలంకను సందర్శించే పర్యాటకుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.

గత ఏడాదిలో చైనా నుంచి 136,294 మంది, ఇండియా నుంచి 206,337 మంది శ్రీలంకలో పర్యటించారు. ప్రస్తుతం శ్రీలంక వెళ్లే పర్యాటకులు ముందుగా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) సమర్పించాలి. అయితే, సింగపూర్, మాల్దివులు, సీషెల్స్‌కు ఈటీఏ నుంచి మినహాయింపు ఉంది. ఈ దేశాలు విసా ఆన్ అరైవల్ కింద ఉచితంగా శ్రీలంకలో పర్యటించవచ్చు.

 

మామాట: సుందర ద్వీపాన్ని సందర్శించే మంచి అవకాశం…

 

Leave a Reply