మ్యాచ్ వాయిదా పడటం ఇండియాకి కలిసొస్తుందా….కివీస్ బౌలర్లని ఎదుర్కోవడం సులువేనా?

IND vs NZ semi-complete.. Rain extends first semifinal into reserve day
Share Icons:

లండన్:

 

లీగ్ దశలో కొన్ని మ్యాచ్ లకు అడ్డు తగిలి ఆపేసిన వరుణ దేవుడు సెమీస్ మ్యాచ్ ని కూడా ఆపేశాడు. అయితే సెమీస్ కు రిజర్వ్ డే ఉండటం వలన మ్యాచ్ ఈరోజుకి వాయిదా పడింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన సెమీస్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇక ఎడతెరిపిలేని వర్షంతో మైదానం చిత్తడిగా మారిపోయింది. పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటకు అనువుగా లేదని తేల్చడంతో మ్యాచ్‌ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఐసీసీ నిబంధనల ప్రకారం వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి ఉన్న ఇన్నింగ్స్‌ను మరుసటిరోజు తిరిగి కొనసాగించనున్నారు. అయితే బుధవారం కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఒక వేళ మ్యాచ్‌ పూర్తిగా రద్దయితే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ నేరుగా ఫైనల్లోకి దూసుకెళుతుంది. లేకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఓవర్లు కుదించి మ్యాచ్‌ను కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు

 

కాగా, మంగళవారం టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. కెప్టెన్‌ విలియమ్సన్‌ (67), రాస్‌ టేలర్‌ (67 నాటౌట్‌) అర్ధసెంచరీలతో 46.1 ఓవర్లలో 211/5 స్కోరు చేసింది. ఇండియా పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌ నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. స్వింగ్‌తో అదరగొడుతూ పరుగులను నియంత్రించారు. విలియమ్సన్‌, టేలర్‌ మినహా ఎవరూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడం మన బౌలింగ్‌ సత్తాను చాటింది. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమ్‌ఇండియా బౌలర్లు ఒక్కో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

 

కాకపోతే వర్షం కారణంగా మ్యాచ్‌ బుధవారానికి వాయిదా పడటం ఒకందుకు మనకు మంచే చేసింది. చిత్తడిగా ఉన్న ఔట్‌ఫీల్డ్‌పై ఛేదన అంత సులువు కాదు. తగ్గించిన టార్గెట్‌ను ఛేదించేందుకు మంగళవారమే భారత్‌ బరిలో దిగుతుందని అంతా ఊహించారు. కానీ 20 ఓవర్లలో 148 పరుగులు చేయాల్సి వచ్చినా మాంచెస్టర్‌లో అది అంత సులభతరం అయ్యేది కాదు.

Leave a Reply