IND vs AUS 2nd ODIలో ధావన్, రాహుల్, కోహ్లీ హిట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 341

Share Icons:
ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మెరుగైన స్కోరు చేయగలిగింది. మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (96: 90 బంతుల్లో 13×4, 1×6), కేఎల్ రాహుల్ (80: 52 బంతుల్లో 6×4, 3×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (78: 76 బంతుల్లో 6×4) నిలకడగా ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. కేన్ రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీశాడు.

Read More:

సిరీస్‌లో వరుసగా రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (42: 44 బంతుల్లో 6×4), శిఖర్ ధావన్ జోడీ తొలి వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చింది. అయితే.. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో రోహిత్ శర్మ ఔటవగా.. నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ కోహ్లీ ఓపెనర్ ధావన్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని నడిపించాడు. ఈ జోడీ రెండో వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ స్కోరుకి బాటలు వేసుకుంది.

Read More:

శతకం దిశగా దూసుకెళ్తున్న శిఖర్ ధావన్‌ని జట్టు స్కోరు 184 వద్ద కేన్ రిచర్డ్‌సన్ ఔట్ చేయగా.. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (7)ని ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. ఈ దశలో కాస్త జోరు తగ్గించిన కోహ్లీ.. సెంచరీ చేసుకునేలా కనిపించాడు. అయితే.. తొలి వన్డేలో ఔట్ చేసిన జంపానే ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీని ఔట్ చేసేశాడు. దీంతో.. భారత్ జట్టు స్కోరు బోర్డు నెమ్మదించింది. కానీ.. ఆఖర్లో రవీంద్ర జడేజా (20 నాటౌట్: 16 బంతుల్లో 1×4)తో కలిసి దూకుడుగా ఆడిన కేఎల్ రాహుల్ టీమిండియాకి గౌరవమైన స్కోరుని అందించాడు.