చైనాలో పెరుగుతున్న కరోనా మృతులు…చైనీయుల వీసా రద్దు…

Share Icons:

బీజింగ్: చైనాలో కరోనా విధ్వంసం ఆగలేదు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుంది.  ఈ వైరస్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 490కి చేరుకుంది. ఒక్క మంగళవారమే కరోనా వైరస్ కారణంగా 65 మంది మృతిచెందినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. మంగళవారం మరో 3,887 మందికి కొత్తగా వైరస్ సోకినట్టు తెలిపింది. దీంతో మొత్తం 24,324 మంది ఈ వైరస్ బారినపడినట్టు వెల్లడించింది.

జపాన్‌కు చెందిన నౌకలోని 10 మందికి కరోనా వైరస్ సోకినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, నౌకలోని మిగతావారికి పరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. నౌకలో మొత్తం 3,7000 మంది ఉండగా, ఇప్పటి వరకు 273 మంది పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే మరో 24 దేశాల్లో మొత్తం 176 కేసులు వెలుగుచూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని దేశాల్లోని విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ మెషీన్లు ఏర్పాటుచేశారు. దీనిపై ప్రపంచమంతా అలర్ట్‌ అయి, ముందస్తు జాగ్రత్తలను చేపడుతున్నారు. ఒకప్పుడు సార్స్‌ ప్రబలినపుడు చైనా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిందో ప్రస్తుతం అంతకు మించి ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే భారత్‌లో పర్యటించడానికి చైనీయులకు జారీ చేసిన విసాలన్నింటినీ మనదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణించిన చైనీయులు సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతుండటం, వేలాదిమందిలో కరోనా వైరస్ జాడ కనిపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత్.. ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వైరస్ సోకిన చైనీయులు భారత్‌కు బయలుదేరి వచ్చే అవకాశాలు ఉన్నందున విసాలన్నింటినీ రద్దు చేసింది.

ఈ విషయాన్ని చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రబలిపోవడానికి ముందే విసాలను పొంది ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న చైనీయుల విసాలు కూడా రద్దయినట్లుగానే భావించాలని పేర్కొన్నారు. ఇదివరకే మంజూరు చేసిన విసాలన్నీ రద్దయ్యాయని, కొత్త విసాల కోసం బీజింగ్, షాంఘై, గ్వాంగ్ఝౌ నగరాల్లో ఉన్న భారత రాయబార, కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.

 

Leave a Reply