పాక్ సాయం నిలిపేత.. అమెరికా సైన్యం

Share Icons:

వాషింగ్టన్, సెప్టంబరు 03,

పాకిస్తాన్‌కు  రూ. 2100 కోట్ల (30 కోట్ల డాలర్లు) సాయం రద్దు చేస్తున్నట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. ఆ దేశంలో ఉన్న తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ కోనీ ఫాల్క్‌నర్ తెలిపారు. పాక్ పొరుగు దేశమైన అఫ్గానిస్తాన్‌లో 17 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న తీవ్రవాద సంస్థలకు పాక్ ఆశ్రయం ఇస్తోందని  అన్నారు. కాగా పాకిస్తాన్ తమ తీరు మార్చుకుంటే మళ్లీ తమ సాయం పొందవచ్చని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అమెరికా పాకిస్తాన్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం రద్దు  చేయాలనుకుని రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయానికి ఇంకా అమెరికా పార్లమెంటు నుంచి ఆమోదం లభించలేదు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కొత్త సంవత్సరం తొలి రోజున చేసిన ఒక ట్వీట్‌లో, పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపించారు. అమెరికా నుంచి బిలియన్ డాలర్ల సాయం అందుకుంటూనే తీవ్రవాదులను పెంచిపోషిస్తోందని మండిపడ్డారు.  “అమెరికా 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు 33 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం అందించింది. బదులుగా ఆ దేశం అబద్ధాలు, కుట్రలు చేస్తోంది. వాళ్లు అమెరికా నేతలను మూర్ఖులుగా భావిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో మేం వెతుకుతున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. దీన్ని ఉపేక్షించం” అని ట్రంప్ అప్పట్లో అన్నారు.

దక్షిణ ఆసియాలో అమెరికా సైనిక వ్యూహానికి సహకరించకపోవడం వల్ల పాకిస్తాన్‌కు మిగతా 30 కోట్ల డాలర్ల సాయం కూడా రద్దు చేస్తున్నాం అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి కోనీ ఫాల్క్‌నర్ తెలిపారు.  అమెరికా తాజా నిర్ణయంతో పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కష్టాల్లో పడ్డారు. ఆగస్టులో అధికార పగ్గాలు అందుకున్న ఇమ్రాన్ దేశ ఆర్థిక సమస్యలను చక్కదిక్కేందుకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2017 మేలో పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు 16.4 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి 10 బిలియన్ డాలర్ల కంటే కిందికి చేరుకున్నాయి.

మామాట : చూద్దాం ఇమ్రాన్ ఎలా స్పంధిస్తారో.

Leave a Reply