హైదరాబాద్ లో బిజెపి కి భవిష్యత్తు ?

Share Icons:

 తెలంగాణ బిజెపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో ఉందా లేదా అన్నట్లు గా ఉంటూ, కేవలం సిటీ పరిధిలో మాత్రమే తన ప్రభావం చూపిస్తూ వచ్చిన బీజేపీ గత కొంతకాలంగా బలం పుంజుకుంది.   దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అధికార పార్టీ టిఆర్ఎస్ హవాను తట్టుకుని మరీ విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు నుంచి రాజకీయ పరిణామాలు శరవేగంగా మార్పు చెందుతున్నాయి. ఈ మార్పు  బీజేపీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఓటమి పరాజయంతో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో, బిజెపి కూడా పార్టీ జెండా ఎగురవేసేందుకు పోటీపడుతోంది.

టీఆర్ఎస్ వైఖరిని చూస్తుంటే, డిసెంబర్ మొదటి వారంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండేట్లు అనిపిస్తున్నది. దీంతో బిజెపి ఇక్కడ గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దుబ్బాకలో మాదిరిగా సమష్టిగా బిజెపికి ఇక్కడ విజయం చేకూర్చే విషయంపై పార్టీ నాయకులు  దృష్టి సారించారు ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎన్నికల ప్రచార అస్త్రాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశం, వరద సహాయం పైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని, దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే బిజెపికి మంచి రోజులు వస్తాయని, ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

గ్రేటర్ లో సమష్టిగా టిఆర్ఎస్ పై పోరాడాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి అధిష్టానం కూడా తగిన సహాయ సహకారాలు అందించడం  కలిసివచ్చే సూచనలు. గ్రేటర్ లో బిజెపి జెండా ఎగురవేసేందుకు   పార్టీ పెద్దలు ప్రణాళికను సిద్ధం చేసారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు కొత్తగా గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జిహెచ్ఎంసి ఎన్నికల నిమిత్తం పూర్తిగా ఉపయోగించుకోవాలని బిజెపి కేంద్ర నేతలు అభిప్రాయపడుతున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వంటి ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాలతో పాటు అంబర్ పేట, హిమాయత్ నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పట్టు ఉండడం, ఈ పార్లమెంట్ పరిధిలోనే ఇవి ఉండటంతో ఇక్కడ ఆయన పూర్తిగా దృష్టి సారించబోతున్నారు. బండి సంజయ్ విషయానికి వస్తే, ఎక్కువగా యువతలో ఆయనకు మంచి అనుచరగణం ఉండటంతో, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటూ, గ్రేటర్  కార్యక్రమాలు నిర్వహిస్తూ , ఓటర్ జాబితా దగ్గర నుంచి అన్ని వ్యవహారాలను చూసుకునే విధంగా వ్య్యుహ రచన చేసుకున్నారు. 

 అరవింద్ విషయానికి వస్తే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు, కేటీఆర్, హరీష్ ఇలా ఎవరిపైననైనా ముక్కుసూటిగా విమర్శలు చేయడంలో దూకుడుగా వ్యవహరిస్తారని అధిష్టానం నమ్ముతోంది. అందుకే ఆయన సేవలను జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని చూస్తోంది. కొత్తగా ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు గ్రేటర్ బాధ్యతను అప్పగిస్తే ఆయన న్యాయం చస్తారని, విద్యావంతుడు కావడమే కాకుండా కెసిఆర్, కేటీఆర్, హరీష్ కు బాగా తెలిసిన వ్యక్తి కావడం, దుబ్బాక ఎన్నికల్లో ఆయన గెలుపొందడంతో పెరిగిన వ్యక్తిత్వాన్ని అన్నిటినీ వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నలుగురుతో గ్రేటర్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని  కేంద్ర నేతలు సిద్ధమౌతున్నారు. 

-భరద్వాజ 

Leave a Reply