హుజుర్‌నగర్‌ టికెట్ గోల: రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్…

huzurngara by election ticket issue in congress party
Share Icons:

హైదరాబాద్: హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టికెట్ల గోల మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు టికెట్ల గోలలో మునిగిపోయారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తమ పార్టీ తరపున అభ్యర్థిగా స్థానిక నేత అయిన చామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని రేవంత్‌ ప్రకటించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. హుజూర్‌నగర్‌లో పద్మావతినే సరైన అభ్యర్థి అని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ చెప్పే అభ్యర్థి పేరు నాకే కాదు..జానారెడ్డికి కూడా తెలియదు . 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం..మమ్మల్ని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా? ఈ మధ్య పార్టీలో చేరిన వాళ్ళ సలహాలు అవసరం లేదు. రేవంత్‌పై కోమటిరెడ్డి కామెంట్స్ అని పెట్టకండి.. నా పరువు పోతుంది. హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌దే గెలుపు. కాంగ్రెస్ సీనియర్లంతా నన్నే పీసీసీ చీఫ్‌ కావాలని అంటున్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ..నేను ఏకమయ్యాం. ఇన్నాళ్లు అభిప్రాయ భేదాలున్నాయి. ఇప్పుడు కలిసిపోయాం’’ అని కోమటిరెడ్డి అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయంటూ రేవంత్‌రెడ్డి బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియాను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం శాసనసభకు వచ్చిన రేవంత్‌రెడ్డి ఇన్నర్‌ లాబీల్లో పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో విడివిడిగా మంతనాలు జరిపారు.

హరీష్ ని కలిసిన జగ్గారెడ్డి..

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీ లాబీలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. దాదాపు అరగంట పాటు ఇరువురూ చర్చలు జరిపారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గ ప్రజల కోసం 14 ఏళ్ల తర్వాత హరీశ్‌రావుతో మాట్లాడానన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. తన వినతిపై హరీశ్ సానుకూలంగా స్పందించారని జగ్గారెడ్డి చెప్పారు.

 

Leave a Reply