ఉప ఎన్నిక వార్: కాంగ్రెస్ లో అంతర్గత పోరు….

Share Icons:

హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక….కాంగ్రెస్ లో అంతర్గత పోరుకు తెర తీసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి  లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలవడంతో…హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. ఇప్పటికే హుజూర్‌నగర్‌ టికెట్ పద్మావతి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించేశారు. ఉత్తమ్ భార్య అయిన పద్మావతి మొన్న ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే పద్మావతికి టికెట్ కేటాయించడం పట్ల వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గం ఫైర్ అవుతుంది.

అక్కడ టికెట్ ఆశిస్తున్న చామల కిరణ్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి..రేవంత్ ని కలిసి టికెట్ వచ్చేలా చేయాలని కోరారు. దీంతో రేవంత్ అధిష్టానం వద్ద టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఉత్తమ్ ఒక్కరే టికెట్ ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు. అంతేకాదు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాకు ఫిర్యాదు చేశారు. అభ్యర్థి విషయంలో ఉత్తమ్ కుమార్ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని తప్పుబట్టారు. ఈ క్రమంలోనే రేవంత్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలో తమకు తెలుసని కోమటిరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ రాజకీయాల విషయంలో పక్క జిల్లా నేతల సలహాలు తమకు అవసరం లేదని స్పష్టంచేశారు. హుజూర్‌నగర్‌లో పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని చెప్పుకొచ్చారు. జిల్లాలో 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నామని.. తమని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా.? అన్ని ప్రశ్నించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తానూ ఒక్కటయ్యామని.. గతంలో కొంత అభిప్రాయ భేదాలున్నా, వాటిని పక్కనబెట్టామని తెలిపారు. ఈ మధ్య పార్టీలో చేరినవారి సలహాలు తమకు అవసరం లేదని అన్నారు.

ఇక వెంకటరెడ్డి వ్యాఖ్యలకు ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక జిల్లాల వారిగా జరగదని, తమ అభ్యర్థిని తామే ఎంపిక చేసుకుంటామనడం సరికాదన్నారు. అభ్యర్థి ఎంపిక అధిష్టానం పరిధిలో ఉంటుందని రాజగోపాల్‌ రెడ్డి చెప్పారు. మొత్తం మీద హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ లో నేతల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply