హుజూర్ నగర్‌ ఉపఎన్నిక: కాంగ్రెస్, టీఆర్ఎస్ ల్లో టికెట్ లొల్లి

huzurnagar by election ticket fight in congress and trs
Share Icons:

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీలు మరో ఎన్నికకు సిద్ధమయ్యాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలవడంతో….హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే హుజూర్ నగర్ టికెట్ కోసం ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్ ల్లో టికెట్ లొల్లి షురూ అయింది. పైగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే, తన సతీమణి పద్మావతి పేరును టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంపై రేవంత్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

హుజూర్ నగర్ కాంగ్రెస్ నాయకురాలు శ్యామల కిరణ్ రెడ్డి….స్థానిక నాయకులతో కలిసి ఈ విషయంపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి శ్యామలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాతో సమావేశమైన రేవంత్ రెడ్డి… ఉత్తమ్ ఏకపక్షంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కు ఈ అంశంలో షోకాజ్ నోటీసు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కుంతియాను కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని కుంతియా రేవంత్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం.

హుజూర్ నగర్‌లో స్థానికుడైన కిరణ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని తాము ప్రతిపాదించే ఆలోచనలో ఉన్నామని రేవంత్ రెడ్డి కుంతియా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అటు పద్మావతిని గెలిపించుకునేందుకు ఉత్తమ్‌ ఇప్పటికే స్థానిక నేతలని కలుస్తూ ముందుకెళుతున్నారు. ఇటు రేవంత్ కూడా శ్యామలకు టికెట్ ఇప్పించేందుకు అధిష్టానం వద్ద గట్టి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టీఆర్ఎస్ లో కూడా టికెట్ లొల్లి రాజుకుంది. టీఆర్ఎస్ నుంచి ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన సానంపూడి సైదిరెడ్డి మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్నారు. అటు మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మరొకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్గాలు అయితే ఎంపీగా ఓడిపోయిన కవితకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ టికెట్ లొల్లి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Leave a Reply