హుజూర్ నగర్ ఎఫెక్ట్: కాంగ్రెస్ లో మారుతున్న సమీకరణాలు

huzurngara by election ticket issue in congress party
Share Icons:

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఉత్కంతగా ఎదురుచూసిన హుజూర్ నగర్ ఫలితం వెలువడిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి…కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి రెడ్డిపై 43 వేల పైనే మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇక్కడ టీడీపీ, బీజేపీలు డిపాజిట్ కోల్పోయాయి. అయితే హుజూర్ నగర్ లో తన భార్య పద్మావతి ఓటమికి నైతిక బాధ్యతగా పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఎప్పుడైతే ఉత్తమ్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుందో అప్పుడే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఢిల్లీ వెళ్తున్న ఉత్తమ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉపఎన్నిక ఫలితాలు, రాష్ట్ర రాజకీయాలపై సోనియాతో ఆయన చర్చించనున్నట్టు సమాచారం. పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఉత్తమ్ పాల్గొంటారని తెలుస్తోంది. హుజూర్‌నగర్ ఫలితాలు వెలువడిన వెంటనే ఉత్తమ్ ఢిల్లీ వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉంటే అధిష్టానం ఆమోదించినా… ఆమోదించకపోయినా… టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసైడయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రేసు మొదలైనట్టే అని ప్రచారం మొదలైంది.

ఉత్తమ్ తప్పుకుంటే టీ పీసీసీ చీఫ్ పోస్టు దక్కించుకోవాలని… తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందున్నారు. వీరితో పాటు వీహెచ్ వంటి సీనియర్ నేతలు కూడా టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో ఉత్తమ్ రాజీనామా చేసిన వెంటనే, నేతలంతా టీ పీసీసీ చీఫ్ పోస్టు దక్కించుకునేందుకు ఢిల్లీ బాట పట్టే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇప్పటికే కొందరు నేతలు ఈ పదవి కోసం ఢిల్లీలోని తమ పరిచయాలను వినియోగించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉత్తమ్ టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తే… తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రేసు మొదలైనట్టే అని భావించాలి.

Leave a Reply